KCR: కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు!

KCR Harish Rao Etela Rajender Get Notices in Kaleshwaram Project Case
  • కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు
  • నోటీసులు జారీ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
  • వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌తో పాటు, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్ నోటీసులు పంపింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించింది. ఇందుకోసం నిర్దిష్ట తేదీలను కూడా కమిషన్ ఖరారు చేసింది.

కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ తన నోటీసులో స్పష్టం చేసింది. అలాగే, కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్ రావు జూన్ 6వ తేదీన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కూడా విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటి పారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి తగిన విధంగా కమిషన్ గడువును ఏడుమార్లు పొడిగించింది.
KCR
Kaleshwaram Project
Harish Rao
Etela Rajender
Telangana
Justice PC Ghose Commission

More Telugu News