Nara Lokesh: జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడతారు: లోకేశ్ ఫైర్

Nara Lokesh Fires at Jagan Reddy Over Tirupati Incident
  • తిరుపతి విద్యార్థి ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నారు: లోకేశ్
  • టీడీపీపై దుష్ప్రచారానికి సాక్షి పత్రికను వాడుకుంటున్నారని ఆరోపణ
  • జేమ్స్‌పై దాడి నిందితులు వైసీపీ నేతల అనుచరులేనని వెల్లడి
  • జగన్‌దే రక్తచరిత్ర అని విమర్శలు
తిరుపతిలో ఓ దళిత విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నవారు వైసీపీ నేతల అనుచరులేనని, అయినప్పటికీ టీడీపీపై బురద చల్లేందుకు జగన్, ఆయన కరపత్రిక సాక్షి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఈ నెల 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏ-1 యశ్వంత్, ఏ-2 కిరణ్, ఏ-3 జగ్గ, ఏ-4 లలిత్, ఏ-5 సాయి గౌడ్, ఏ-6 వంశీ, ఏ-7 రూపేష్‌లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని తెలిపారు. వీరిలో జగదీష్ అలియాస్ జగ్గ, లలిత్ అలియాస్ లలిత్ గోపాల్, నాని, సాయి గౌడ్‌లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులని ఆరోపించారు. అలాగే, ఉండు రూపేష్ రెడ్డి అలియాస్ రూపి, సాయి కిరణ్ కుమార్ రెడ్డిలు భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసేవారని, వంశీ అలియాస్ చోటా బ్లేడ్ ఎంపీ గురుమూర్తి అనుచరుడని లోకేశ్ పేర్కొన్నారు.

"వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ వారే జేమ్స్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ సాక్షిలో తప్పుడు కథనాలు రాయించారు. రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడే జగన్ రెడ్డి, విద్యార్థుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను మా పార్టీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దళిత సోదరులను రెచ్చగొట్టేలా తమ కరపత్రిక సాక్షిలో తప్పుడు రాతలతో విషం చిమ్ముతున్నారు" అని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి ఘటనలో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారని, మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని, నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు.

"రాజకీయంగా జగన్ రెడ్డి గారి హిస్టరీ యావత్తు ఆసాంతం రక్తచరిత్రే. బాబాయిని బాత్రూమ్‌లో గొడ్డలివేటుతో లేపేసి, బాబుగారి చేతిలో కత్తి పెట్టి, నాడు అవినీతి విషపుత్రిక సాక్షిలో అడ్డగోలు రాతలు రాయించారు. అసలు నిజమేంటో సొంత చెల్లెళ్లతో సహా రాష్ట్ర ప్రజలంతా ఆలస్యంగా తెలుసుకున్నారు" అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళిత సోదరులను ఊచకోత కోసిన జగన్, ప్రతిపక్షంలోనూ అవే పోకడలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఘటనలో వాస్తవాలను, జగన్ రెడ్డి కుట్రలను గుర్తించి యావత్ దళిత సమాజం అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Jagan Reddy
Tirupati
Dalit student attack
Sakshi newspaper
Andhra Pradesh politics
TDP
YCP
Political gain
Crime

More Telugu News