TSA: అమెరికాకు వెళుతున్నారా? అయితే లగేజీలో ఈ వస్తువులు ఉండొద్దు!

TSA New Rules Lithium Batteries Restricted in US Flight Luggage
  • అమెరికా విమానాల్లో చెక్-ఇన్ లగేజీపై కొత్త నిబంధనలు
  • లిథియం బ్యాటరీతో పనిచేసే 7 రకాల వస్తువులపై ఆంక్షలు
  • నిషేధిత వస్తువులను క్యారీ-ఆన్ బ్యాగుల్లోనే అనుమతి
  • విమానాల్లో అగ్నిప్రమాదాల నివారణకే చర్యలు
అమెరికాకు విమానాల్లో ప్రయాణించే వారి కోసం అక్కడి అధికారులు లగేజీకి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను జారీ చేశారు. విమాన ప్రయాణాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే ఉద్దేశంతో, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. అమెరికా ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (టీఎస్ఏ), ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్ఏఏ) సంయుక్తంగా ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశాయి.

ఈ తాజా నిబంధనల ప్రకారం, లిథియం బ్యాటరీలతో పనిచేసే ఏడు రకాల వస్తువులను ప్రయాణికులు తమ చెక్-ఇన్ లగేజీలో తీసుకువెళ్లడంపై నిషేధం విధించారు. అయితే, ఈ వస్తువులను తమతో పాటుగా క్యారీ-ఆన్ లగేజీలో తీసుకువెళ్లే వెసులుబాటు ఇచ్చారు. విమానాల్లో, ముఖ్యంగా లగేజీ ఉంచే కార్గో ప్రాంతంలో లిథియం బ్యాటరీల వల్ల మంటలు చెలరేగే ప్రమాదాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం.

నిషేధించిన వస్తువుల జాబితా ఇదే

చెక్-ఇన్ లగేజీలో అనుమతించని వస్తువులు ఈ విధంగా ఉన్నాయి... పవర్‌ బ్యాంక్‌లు, సెల్‌ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ కేస్‌లు, స్పేర్‌ లిథియం-అయాన్ బ్యాటరీలు, స్పేర్ లిథియం-మెటల్ బ్యాటరీలు, సెల్‌ఫోన్‌ బ్యాటరీలు, ల్యాప్‌ట్యాప్‌ బ్యాటరీలు, ఎక్స్‌టర్నల్‌ బ్యాటరీ ప్యాక్‌లు, పోర్టబుల్ రీఛార్జర్‌లు.

నిషేధం వెనుక కారణాలు

లిథియం బ్యాటరీలు సులువుగా వేడెక్కే స్వభావం కలిగి ఉంటాయని, దీనివల్ల 'థర్మల్‌ రన్‌అవే' అనే ప్రమాదకరమైన రసాయన ప్రతిచర్య జరిగి మంటలు వ్యాపించే అవకాశం ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తన మార్గదర్శకాల్లో వివరించింది.

బ్యాటరీలను అధికంగా ఛార్జ్ చేయడం (ఓవర్‌ ఛార్జింగ్‌), సరైన పద్ధతిలో ప్యాక్ చేయకపోవడం లేదా వాటి తయారీలో లోపాలు ఉండటం వంటి కారణాల వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని కూడా ఎఫ్ఏఏ స్పష్టం చేసింది. విమానం కార్గో భాగంలో ఇలాంటి ప్రమాదం జరిగితే, దాన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడం కష్టతరం అవుతుంది. అందుకే, ఈ వస్తువులను ప్రయాణికుల పర్యవేక్షణలో ఉండే క్యారీ-ఆన్ లగేజీలో మాత్రమే అనుమతిస్తున్నారు.
TSA
USA travel
lithium batteries
luggage restrictions
carry-on luggage
checked baggage
FAA

More Telugu News