Nara Lokesh: షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేశ్... విద్యార్థులు ఏమన్నారంటే...!

Nara Lokesh Honors Shining Stars SSC Toppers
  • సర్కారీ బడుల్లో చదివినా ర్యాంకులు సాధించొచ్చు
  • ప్రభుత్వ పాఠశాలల్లోనూ అర్హులైన ఉపాధ్యాయులు
  • పదో తరగతికి '100 రోజుల ప్రణాళిక' సక్సెస్
  • మంత్రి లోకేశ్ చేతుల మీదుగా సన్మానంపై విద్యార్థుల హర్షం
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి మెరుగుపడ్డాయన్న విద్యార్థులు
  • విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ వచ్చాక పాఠశాలల్లో సానుకూల మార్పులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పదో తరగతి విద్యార్థులు నిరూపించారు. సర్కారీ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని తాము సాధించిన మార్కులే నిదర్శనమని వారు ధీమా వ్యక్తం చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ‘షైనింగ్ స్టార్స్-2025’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని, అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మమ్మల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారు సన్మానిస్తారని అస్సలు ఊహించలేదు, చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని మా మార్కులే నిరూపించాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత, రుచి పెరిగాయి. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తున్నారు. లోకేశ్ గారి ప్రోత్సాహం మా తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం" అని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కంచరాన జ్యోషిత 600కు 597 మార్కులు సాధించింది. ఆమె మాట్లాడుతూ, "మంత్రి లోకేశ్ గారి చేతుల మీదుగా మెడల్ అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ స్థాయిలో బోధన అందుతోంది. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ గారు బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో చాలా మార్పులు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావాలన్నది నా లక్ష్యం, యూపీఎస్సీ కూడా సాధించి ప్రజలకు సేవ చేస్తా" అని అన్నారు.

పల్నాడు జిల్లా మాచర్ల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ సమీర 600కు 596 మార్కులు సాధించింది. "మా నాన్న ఎలక్ట్రీషియన్. లోకేశ్ గారితో సన్మానం అందుకుంటానని ఊహించలేదు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చాలా మెరుగుపడింది. మంత్రిగా లోకేశ్ గారు వచ్చాక స్టడీ మెటీరియల్ అందించారు, జిల్లా స్థాయిలో సమావేశాలు ఉపయోగపడ్డాయి. ఐఏఎస్ అయ్యాక పేద విద్యార్థులకు ఉచిత విద్య, రైతులకు సహాయం చేస్తా. పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా" అని సమీర వివరించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన దివ్యాంగ విద్యార్థి కనితి కిషోర్ 500కు 487 మార్కులు సాధించాడు. "మంత్రి గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి పరీక్షలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ మంచి ఫలితాలనిచ్చింది. అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనుకున్నా. ఐఎఫ్‌పీ ప్యానళ్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ బాగున్నాయి. గతంలో కంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల నాణ్యత పెరిగింది, వాటిపై పార్టీ గుర్తులు లేకపోవడం మంచి నిర్ణయం. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ కావడంతో గ్రాండ్ టెస్టులు భయాన్ని పోగొట్టాయి. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం" అని కిషోర్ తెలిపాడు.

విద్యార్థిని పావని చంద్రిక తల్లి అంగడి సంధ్య మాట్లాడుతూ, "మా పాప మంత్రిగారి చేతుల మీదుగా సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించారు, 100 రోజుల యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడింది" అని అన్నారు. పదో తరగతి పరీక్షల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Nara Lokesh
AP SSC Results 2024
Andhra Pradesh Education
Government Schools AP
Shining Stars 2025
10th Class Results
AP Education Minister
Dokkala Seethamma Midday Meal Scheme
Pavanai Chandrika
Kancharana Jyoshita

More Telugu News