BR Naidu: 'డీడీ నెక్ట్స్ లెవల్ చిత్రం'పై చట్టపరమైన చర్యలు: టీటీడీ పాలకమండలి నిర్ణయం

BR Naidu TTD to Take Legal Action on DD Next Level Movie
  • నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
  • సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
  • శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసిన సినిమా బృందంపై చర్యలకు ఆమోదం
  • తిరుమల కొండల్లో పచ్చదనం 80 శాతానికి పెంపు
  • స్విమ్స్‌కు అదనపు చేయూత ఇవ్వాలని నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం జరిగిన సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వైద్య సేవలు, భద్రతాంశాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వివరాలను బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పచ్చదనం పెంపునకు పెద్దపీట
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం 68.14 శాతంగా ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ సహకారంతో 80 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత దశలవారీగా నిధులు విడుదల చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.74 కోట్లు, 2026-27లో రూ.1.13 కోట్లు, 2027-28లో రూ.1.13 కోట్లను అటవీశాఖకు అందజేయాలని నిర్ణయించింది.

ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించాలని బోర్డు తీర్మానించింది. ఇందుకోసం ఆర్కిటెక్ట్‌ల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించనుంది.

విశ్రాంతి భవనాల పేర్ల మార్పు, క్యాంటీన్ల లైసెన్స్ ఫీజు
తిరుమలలోని విశ్రాంతి భవనాల పేర్ల మార్పు విషయంలో స్పందించని ఇద్దరు దాతలకు చెందిన గృహాల పేర్లను టీటీడీయే మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశానికి ఆమోదం తెలిపారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరున్న సంస్థలకు ఈ క్యాంటీన్లను అప్పగించాలని నిర్ణయించారు.

స్విమ్స్‌కు అదనపు చేయూత
రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయాన్ని పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏటా అందిస్తున్న రూ.60 కోట్లకు అదనంగా మరో రూ.71 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. స్విమ్స్‌లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని, 85 శాతం నిర్మాణాలు పూర్తయిన ఆంకాలజీ, పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి భవనాల మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. శ్రీవారి వైద్య సేవలను కూడా విస్తృతం చేయాలని తీర్మానించారు.

ఇతర కీలక నిర్ణయాలు

* ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలను సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
* టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను బదిలీ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, అవసరమైతే స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకోవాలని ఆమోదించారు.
* తిరుమల ఆలయ భద్రత దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించి, తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
* ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింతగా పెంచాలని తీర్మానించారు.
* తుళ్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.



BR Naidu
TTD
Tirumala
Tirupati
DD Next Level Movie
TTD Board Decisions
Tirumala Greenery
Temple Development
SVIMS Hospital

More Telugu News