Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish Rao Open Letter to CM Revanth Reddy on Anganwadi Salaries
  • మినీ అంగన్‌వాడీలకు పూర్తి జీతాలివ్వాలని సీఎంకు హరీశ్ రావు లేఖ
  • రూ.13,650 నుంచి రూ.7,800కి జీతాలు తగ్గించడంపై ఆగ్రహం
  • మూడు నెలలే పెంచిన జీతం.. తర్వాత కోత విధించారని ఆరోపణ
  • బీఆర్ఎస్ జీవోనే కాంగ్రెస్ మళ్లీ ఇచ్చి ప్రచారం చేసుకుందని విమర్శ
తెలంగాణలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా గుర్తించి, వారికి పెంచిన వేతనం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని హరీశ్ రావు తన లేఖలో గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సేవలను గుర్తించి, 2023 సెప్టెంబర్ 5వ తేదీన వారిని అంగన్‌వాడీలుగా ప్రమోట్ చేస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా ఆ ఉత్తర్వులు అప్పట్లో అమలు కాలేదని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించి, మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే మళ్లీ కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు మినీ అంగన్‌వాడీలకు అంగన్‌వాడీ పే గ్రేడ్ ప్రకారం రూ.13,650 వేతనం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత మళ్లీ వారి వేతనాన్ని మినీ అంగన్‌వాడీ స్కేల్ అయిన రూ.7,800కి తగ్గించిందని హరీశ్ రావు విమర్శించారు. పెంచిన వేతనాలను తగ్గించే కొత్త సంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని, ఇలాంటి ప్రభుత్వం దేశంలో మరెక్కడా ఉండదేమోనని ఆయన ఎద్దేవా చేశారు. ఒకే పనికి రెండుసార్లు జీవోలు ఇచ్చి ప్రచారం చేసుకోవడం తప్ప, మినీ అంగన్‌వాడీలకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు.

అంకితభావంతో పనిచేస్తున్న వారి కడుపుకొట్టి, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం అన్యాయమని హరీశ్ రావు అన్నారు. "కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు" అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు గుప్పించారు.
Harish Rao
Telangana
Revanth Reddy
Anganwadi workers
Mini Anganwadi
Telangana government

More Telugu News