Indian Tourists: టర్కీ, అజర్‌బైజాన్‌లకు భారత పర్యాటకుల షాక్!

Indian Tourists Shock for Turkey Azerbaijan After Operation Sindoor
  • టర్కీ, అజర్‌బైజాన్‌ వీసా దరఖాస్తుల్లో 42 శాతం క్షీణత
  • 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత మారిన భారతీయుల వైఖరి
  • ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి భారీగా తగ్గిన ప్రయాణికులు
  • వీసాలు రద్దు చేసుకుంటున్న యువత, మహిళలు
  • వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్టులకు పెరుగుతున్న ఆదరణ
భారత్ నుంచి టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ తాజాగా వెల్లడించింది. ఈ రెండు దేశాలకు వీసా దరఖాస్తులు ఇటీవల ఏకంగా 42 శాతం మేర తగ్గినట్లు సదరు సంస్థ తన నివేదికలో పేర్కొంది. 'ఆపరేషన్ సిందూర్‌' సమయంలో పాకిస్థాన్‌కు ఈ దేశాలు బహిరంగంగా మద్దతు తెలపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామంపై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో, ఆయా దేశాల పర్యటనలపై మనవాళ్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

అట్లీస్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో వాస్తవానికి టర్కీ, అజర్‌బైజాన్‌లకు వీసా దరఖాస్తులు గత ఏడాదితో పోలిస్తే 64 శాతం పెరిగాయి. అయితే, 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి ఈ దేశాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుల్లో 53 శాతం తగ్గుదల కనిపించగా, ఇండోర్, జైపూర్ వంటి టైర్-2 నగరాల నుంచి కూడా ప్రయాణికులు మొగ్గు చూపడం లేదని అట్లీస్ తెలిపింది. కుటుంబ సమేతంగా వెళ్లేవారు, గ్రూపు వీసా దరఖాస్తుల్లో 49 శాతం క్షీణత నమోదవ్వగా, ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 27 శాతం తగ్గింది.

వీసా ప్రక్రియ కొనసాగుతున్న దశలో కూడా అనేకమంది తమ ప్రయాణాలను విరమించుకుంటున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా 25 నుంచి 34 ఏళ్ల వయసున్న యువత తమ నిర్ణయాలను వేగంగా మార్చుకుంటున్నారు. టర్కీకి దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 70 శాతం మంది తమ వీసాలను రద్దు చేసుకున్నట్లు అట్లీస్ పేర్కొంది. మహిళా పర్యాటకులు అయితే పూర్తిగా తమ ప్రయాణాలను మార్చుకుని, ప్రత్యామ్నాయంగా వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్టు వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. ఈ దేశాలకు వీసా దరఖాస్తులు ఇటీవల 31 శాతం పెరిగాయి.

ఒకప్పుడు ఇస్తాంబుల్, బాకు వంటి నగరాలకు వెళ్లాలని ఆలోచించిన భారత పర్యాటకులు, ఇప్పుడు ప్రశాంతమైన, రాజకీయంగా తటస్థంగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారని అట్లీస్ విశ్లేషించింది. వివాదాస్పద దేశాలకు వెళ్లవద్దని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పర్యాటకులే స్వయంగా నిర్ణయాలు తీసుకుని, ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారని తాజా నివేదిక స్పష్టం చేసింది.
Indian Tourists
Turkey
Azerbaijan
India tourism
Operation Sindoor
boycott
tourism decline

More Telugu News