Sanjay: గూగుల్ మ్యాప్స్ సహాయంతో 29 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు...

Sanjay Reunites with Family After 29 Years with Google Maps Help
  • తొమ్మిదేళ్ల వయస్సులో రైలెక్కి తప్పిపోయిన బాలుడు
  • 29 ఏళ్ల తర్వాత గూగుల్ మ్యాప్స్‌ సహాయంతో ఇంటికి
  • హర్యానాలోని అంబాలాలో ఈ అరుదైన ఘటన
  • కన్నకొడుకును చూసి తల్లి ఉద్వేగం
హర్యానాలోని అంబాలాలో ఓ అరుదైన, భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం, తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన ఓ వ్యక్తి, 38 ఏళ్ల వయసులో గూగుల్ మ్యాప్స్ సహాయంతో తన కన్నవారి చెంతకు చేరాడు. ఈ ఊహించని పునఃసమాగమంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

వివరాల్లోకి వెళితే, సంజయ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయాడు. అంబాలా రైల్వేస్టేషన్‌లో ఆడుకుంటూ అనుకోకుండా ఓ రైలు ఎక్కేశాడు. ఆ రైలులో ప్రయాణిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చి చూసేసరికి ఆ రైలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి చేరుకుంది. సంజయ్‌కు తన ఇంటి చిరునామా గానీ, తిరిగి ఎలా వెళ్లాలో గానీ తెలియలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత కాలక్రమేణా ఆగ్రా నుంచి మీరట్‌కు, అక్కడి నుంచి రిషికేశ్‌కు మకాం మార్చాడు. 2009లో రాధిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తన గతాన్ని, కుటుంబాన్ని మర్చిపోలేని సంజయ్, తన మూలాలను తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే, ఒకరోజు అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొచ్చాయి. అంబాలాలోని తన ఇంటి సమీపంలో ఒక పోలీస్ పోస్టు, దాని ఎదురుగా ఒక దర్గా ఉండేవని గుర్తొచ్చింది.

వెంటనే ఆ ఆధారాలతో గూగుల్ మ్యాప్స్‌లో వెతకడం ప్రారంభించాడు. తన ఇంటిని గుర్తించాడు. 29 సంవత్సరాల తర్వాత, తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన సంజయ్‌ను చూసి అతని తల్లి వీణ ఆనందంతో ఉప్పొంగిపోయారు. మాటల్లో చెప్పలేని భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడు సంజయ్ తప్పిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆచూకీ కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నామని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
Sanjay
Haryana
Ambala
Google Maps
Family reunion
Missing person
Uttar Pradesh
Agra
Railway station
India

More Telugu News