Duppala Venkata Ramana: నన్ను వేధించడానికే ఏపీ నుంచి బదిలీ చేశారు: జస్టిస్ దుప్పల వెంకట రమణ సంచలన ఆరోపణలు

Justice  Duppala Venkata Ramana Claims Malicious Intent Behind Transfer
  • ఏపీ నుంచి మధ్యప్రదేశ్‌కు తన బదిలీ వేధింపుల కోసమేనన్న జస్టిస్ డీవీ రమణ
  • పదవీ విరమణ వీడ్కోలు సభలో సంచలన ఆరోపణలు
  • భార్య అనారోగ్యం దృష్ట్యా కర్ణాటకకు బదిలీ కోరినా పట్టించుకోలేదని ఆవేదన
  • కొందరి అహం తృప్తిపరిచేందుకే తనను బదిలీ చేశారని ఘాటు వ్యాఖ్యలు
  • సుప్రీంకోర్టు కొలీజియం తన అభ్యర్థనను పరిగణించలేదని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు తనను బదిలీ చేయడం వెనుక తీవ్రమైన వేధింపుల ఉద్దేశం ఉందని జస్టిస్ దుప్పల వెంకట రమణ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్న ఆయన, మంగళవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌లో జరిగిన వీడ్కోలు సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన బదిలీ అన్యాయంగా, దురుద్దేశంతో జరిగిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"నన్ను వేధించాలనే స్పష్టమైన ఉద్దేశంతో, కొన్ని కారణాల వల్ల నా సొంత రాష్ట్రం నుంచి బదిలీ చేశారు. వారి అహాన్ని సంతృప్తిపరిచినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు వారు కూడా పదవీ విరమణ చేశారు. దేవుడు ఎవరినీ క్షమించరు, మర్చిపోరు. వారు కూడా మరో రూపంలో బాధపడతారు," అంటూ జస్టిస్ వెంకటరమణ ఘాటుగా వ్యాఖ్యానించారు.

2023లో తనను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. తన భార్య తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మతతో (సైకోజెనిక్‌ నాన్‌ ఎపిలెప్టిక్‌ సీజర్స్‌ - పీఎన్‌ఈఎస్‌) బాధపడుతున్నారని, ఆమెకు బెంగళూరులోని నిమ్హాన్స్‌లో మెరుగైన చికిత్స అందించే నిమిత్తం తనను కర్ణాటక రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియంను అభ్యర్థించినట్లు తెలిపారు. "బదిలీ సమయంలో నన్ను ఆప్షన్లు అడిగారు. నా భార్యకు నిమ్హాన్స్‌లో మెరుగైన చికిత్స అందుతుందని కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకున్నాను. కానీ సుప్రీంకోర్టు కొలీజియం నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు," అని జస్టిస్ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జులై 19, ఆగస్టు 28 తేదీల్లో ఈ మేరకు విజ్ఞప్తులు పంపినా వాటిని పట్టించుకోలేదని వాపోయారు. "నాలాంటి న్యాయమూర్తి మానవతా దృక్పథంతో సానుకూల పరిశీలన ఆశిస్తారు. నేను తీవ్ర నిరాశకు, వేదనకు గురయ్యాను," అని ఆయన అన్నారు.

అయితే, తన బదిలీ తనను కుంగదీస్తుందని కొందరు ఆశించినా అది జరగలేదని, మధ్యప్రదేశ్‌లో తనకు లభించిన ఆదరణ ఆ శాపాన్ని వరంగా మార్చిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. జబల్‌పూర్‌, ఇండోర్‌లలోని సహచర న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి అపారమైన ప్రేమ, మద్దతు, సహకారం లభించాయని తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించానని, అమరావతి, కృష్ణ, గోదావరి, నర్మదా నదీ తీర ప్రాంతాల్లో పనిచేసే అవకాశం దక్కినందుకు ధన్యుడినని చెప్పారు.

జస్టిస్ దుప్పల వెంకట రమణ 2022 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2007 నుంచి న్యాయాధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు 2023లో ఆయన్ను మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ సమయంలో, కర్ణాటకకు బదిలీ చేయాలన్న జస్టిస్‌ రమణ విజ్ఞప్తిని కొలీజియం తిరస్కరించింది. "జస్టిస్‌ దుప్పల వెంకట రమణ చేసిన అభ్యర్థనలను మేము పరిశీలించాం. ఆయన చేసిన విజ్ఞప్తుల్లో ఎలాంటి యోగ్యత లేదని కొలీజియం భావిస్తోంది," అని అప్పట్లో కొలీజియం పేర్కొన్నట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన తన ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను జస్టిస్ రమణ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. "నేను చేసిన ప్రమాణానికి న్యాయం చేశానని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలుగుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం చేయడమే న్యాయవ్యవస్థ పరమార్థం అని నమ్మి పనిచేశాను," అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. గురజాడ అప్పారావు గారి "దేశమంటే మట్టికాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌" అనే మాటలను తాను ఎప్పటికీ మరవనని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
Duppala Venkata Ramana
Justice DV Ramana
Andhra Pradesh High Court
Madhya Pradesh High Court
High Court Transfer
Supreme Court Collegium
Justice Chandrachud
Nimhans Bangalore
Judicial System
Court News

More Telugu News