Shyamala Rao: తిరుమల భద్రతకు "యాంటీ డ్రోన్" అస్త్రం – టీటీడీ బోర్డు కీలక తీర్మానాలు

Shyamala Rao Announces New Food Initiatives for Tirumala Pilgrims
  • తిరుమల భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ!
  • సీఎం ఆదేశాలతో తిరుమల కొండలపై 80 శాతానికి పచ్చదనం పెంపు
  • స్విమ్స్‌కు అదనంగా రూ.71 కోట్ల ఆర్థిక సాయం, వైద్య సిబ్బంది నియామకం
  • టీటీడీలో అన్యమతస్థులకు వీఆర్ఎస్ లేదా బదిలీకి చర్యలు
  • గోవింద నామావళి రీమిక్స్‌పై ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు
  • తిరుచానూరు, ఒంటిమిట్ట సహా పలు ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు పనిచేయకుండా నిరోధించే అత్యాధునిక "యాంటీ డ్రోన్ టెక్నాలజీ"ని వినియోగించాలని తీర్మానించింది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేశారు. సమావేశానంతరం ఈవో జె. శ్యామలరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

తిరుమల ఆలయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, డ్రోన్ల ద్వారా ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ డ్రోన్ సాంకేతికతతో పాటు మరికొన్నింటిని పరిశీలించి, అత్యుత్తమమైన దానిని ఎంపిక చేయాలని బోర్డు నిర్ణయించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండలపై ప్రస్తుతం ఉన్న 68.14 శాతం పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 80 శాతానికి పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే దశలవారీగా రూ.4 కోట్లు విడుదల చేయనున్నారు. 

అలాగే, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి, నారాయణవనం, కపిలతీర్థం, నాగాలాపురం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌ల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయించారు. తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.

రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రస్తుతం ఇస్తున్న రూ.60 కోట్లకు అదనంగా మరో రూ.71 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని బోర్డు నిర్ణయించింది. స్విమ్స్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతో పాటు, నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. శ్రీవారి సేవ తరహాలోనే "శ్రీవారి వైద్య సేవ"ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు.

తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశానికి ఆమోదం తెలుపుతూ, భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు వీటిని అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం క్యాంటీన్లు నిర్వహిస్తున్న సంస్థల హోటళ్లను ఓ ప్రత్యేక బృందం పరిశీలించి, వారి సేవలు సంతృప్తికరంగా ఉంటేనే అనుమతులు కొనసాగించనున్నారు.  ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని తీర్మానించారు. ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత విస్తృతం చేయనున్నారు.

తిరుమలలోని విశ్రాంతి గృహాల పేర్ల మార్పు విషయంలో స్పందించని దాతలకు చెందిన రెండు వసతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు మార్పుపై వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బదిలీ చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం వర్తింపజేయడం వంటి చర్యలు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు.

ఇటీవల శ్రీవారి గోవింద నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
Shyamala Rao
TTD
Tirumala
Tirupati
Devasthanam
Annadanam
Canteens
Food Quality
Pilgrims
BR Naidu

More Telugu News