Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్!

Israel Planning Attack on Iran Nuclear Facilities CNN Reports
  • అమెరికా నిఘా వర్గాల తాజా నివేదికలో వెల్లడి
  • ఇజ్రాయెల్ తుది నిర్ణయంపై ఇంకా స్పష్టత కరవు
  • అమెరికా-ఇరాన్ అణు ఒప్పందం ఫెయిలైతే దాడుల ముప్పు అధికం
  • ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ పెట్టిన 60 రోజుల గడువు పూర్తి
ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించినట్లు తెలిపింది. అయితే, ఈ దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని వెల్లడించింది.

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు నిఘా వ్యవహారాలతో సంబంధమున్న ఒక అధికారి సీఎన్ఎన్‌కు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా, ఇరాన్‌తో కుదుర్చుకునే అణు ఒప్పందం ద్వారా ఇరాన్‌లోని యురేనియం నిల్వలను పూర్తిగా నిర్మూలించలేకపోతే, దాడుల సంభావ్యత మరింత పెరుగుతుందని సదరు అధికారి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్య మార్గాల్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిఘా నివేదిక బయటకు రావడం గమనార్హం. ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల ప్రకటనలు, రహస్యంగా సేకరించిన సంభాషణల రికార్డులు, సైనిక కదలికలను బట్టి ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు అంచనా వేస్తున్నామని సీఎన్ఎన్ వివరించింది.

మరోవైపు, యురేనియం శుద్ధిని నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్‌ను ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మంగళవారం తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త అణు ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్‌తో అణు ఒప్పంద చర్చలు విఫలమైతే, సైనిక చర్యను కూడా పరిశీలిస్తామని అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఈ చర్చల్లో పురోగతి సాధించేందుకు ఆయన విధించిన 60 రోజుల గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయింది. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
Israel
Iran nuclear program
Iran
nuclear deal
US Iran relations
Donald Trump
Ayatollah Ali Khamenei
nuclear enrichment
Middle East tensions

More Telugu News