Tamil Nadu Government: కేంద్రంపై కోర్టుకెక్కిన తమిళనాడు

Tamil Nadu Government Sues Central Government Over Funds
  • ఎన్ఈపీని అమలు చేయడంలేదని నిధులు ఆపేసిందని ఆరోపణ
  • రాష్ట్రానికి రూ.2,151 కోట్లు విడుదల చేసేలా ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్
  • త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ మరియు ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నమని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ, ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, భారతీయ భాషల పునరుద్ధరణకే త్రిభాషా సూత్రమని కేంద్రం చెబుతోంది.

పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గత ఏడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తుచేసింది. ఈ పథకం కింద రూ.3,585.99 కోట్ల కేటాయింపు జరిగిందని తెలిపింది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది.

అయితే, ఈ మొత్తంలో ఒక్క వాయిదా కూడా కేంద్రం విడుదల చేయలేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. "జాతీయ విద్యా విధానం, పీఎం శ్రీ పాఠశాలల పథకాల అమలుతో సమగ్ర శిక్ష నిధుల విడుదలను కేంద్రం ముడిపెట్టడమే నిధులు విడుదల చేయకపోవడానికి స్పష్టమైన కారణం. ఈ రెండు పథకాలు వేర్వేరు" అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేలా తమపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. నిధుల నిలిపివేత సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంలో జోక్యం చేసుకోవడమేనని డీఎంకే ప్రభుత్వం వాదించింది.
Tamil Nadu Government
NEP
National Education Policy
Narendra Modi
Supreme Court
funds withheld
Samagra Shiksha
PM Shri Schools
three-language formula
Dravida Munnetra Kazhagam

More Telugu News