Vangalapudi Anitha: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనిత

Vangalapudi Anitha Reviews PM Modis Visit Arrangements
  • జూన్ 21న విశాఖకు ప్రధాని మోడీ
  • అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని
  • సాగర తీరంలో ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష
  • అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
  • సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21వ తేదీన విశాఖ సాగర తీరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితర ఉన్నతాధికారులతో కలిసి హోంమంత్రి అనిత బీచ్ రోడ్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన అంశాలను, ఇతర ఏర్పాట్లను ఆమె కూలంకషంగా పరిశీలించారు. యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రజలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికారులు పూర్తి సమన్వయంతో, సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు.

Vangalapudi Anitha
PM Modi
Narendra Modi
Visakhapatnam
International Yoga Day
Yoga Day Celebrations
Andhra Pradesh
Beach Road
Security Arrangements
Collector Prasad

More Telugu News