Chiranjeevi: 'ఖైదీ' విషయంలో అదే జరిగింది: నిర్మాత తిరుపతి రెడ్డి

Thirupathi Reddy Interview
  • నేను చిరంజీవిగారిని అభిమానించేవాడిని 
  • ఆయనతో ఒక సినిమా చేయాలని ఉండేది 
  • 'ఫస్టు బ్లడ్' కథనే 'ఖైదీ'గా రీమేక్ చేశాము 
  • ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిందన్న తిరుపతి రెడ్డి    

చిరంజీవి కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా 'ఖైదీ'. ఆ సినిమాతో ఆయన తిరుగులేని మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాకి తిరుపతి రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమాకి సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నారు. "నేను నెల్లూరులో డాక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. సినిమాలు కూడా ఎక్కువగానే చూస్తూ ఉండేవాడిని. చిరంజీవిగారి డాన్సులు .. ఫైట్లు నాకు బాగా నచ్చేవి" అని అన్నారు. 

" సినిమాలకి ఫైనాన్స్ కూడా చేసేవాడిని. అందువలన సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా పరిశీలించేవాడిని. చిరంజీవిగారు నటించిన 'కిరాయి రౌడీలు' సినిమా చూసిన తరువాత ఆయనతో ఒక సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చూసిన ఇంగ్లిష్ మూవీ 'ఫియర్ ఓవర్ ది సిటీ'ని రీమేక్ చేయాలని అనుకున్నాను. ఆ సినిమా కేసెట్ ను పంపించమని బొంబైలోని షాప్ వారికి కాల్ చేసి చెప్పాను. వాళ్లు పొరపాటున 'ఫస్టు బ్లడ్' మూవీ కేసెట్ పంపించారు" అని చెప్పారు.

" పంపించారు కదా అని 'ఫస్టు బ్లడ్' మూవీ చూశాను .. నాకు కథ నచ్చింది. ఈ సినిమాను చిరంజీవిగారితో చేస్తే బాగుంటుందని అనిపించింది. కోదండ రామిరెడ్డిగారికి సినిమా చూపిస్తే బాగుందని అన్నారు. అప్పుడు చిరంజీవిగారి డేట్స్ తీసుకుని ముందుకు వెళ్లాము. ఈ సినిమాకి 'ఖైదీ' అనే టైటిల్ పెట్టింది కూడా నేనే. 'ఫస్టు బ్లడ్' చూసిన పరుచూరి బ్రదర్స్, ఆ కథను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చారు. అలా ఆ సినిమా చిరంజీవిగారి కెరియర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది" అని చెప్పారు. 

Chiranjeevi
Khaidi movie
Tirupati Reddy
Telugu cinema
Kodanda Ramireddy
Parchuri Brothers
First Blood movie
Kirayi Rowdylu
Telugu film industry
Mass image

More Telugu News