Revanth Reddy: ప్రధానికి అండగా ఉండాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Alleges Central Government Failure on Pakistan Issue
  • పాకిస్థాన్ కు బుద్ధి చెప్పడంలో కేంద్రం విఫలమయిందన్న రేవంత్
  • అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శ
  • ఒక గొప్ప అవకాశాన్ని భారత్ కోల్పోయిందని వ్యాఖ్య
దాయాది దేశం పాకిస్థాన్‌కు తగిన రీతిలో గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి, పాకిస్థాన్ విషయంలో కీలక అవకాశాలను కేంద్రం చేజార్చుకుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌తో వ్యవహరించే తీరులో మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా, వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యుద్ధాన్ని కొనసాగించి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు.

ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో వన్నె తెచ్చారని, భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో గట్టిగా వ్యవహరించేందుకు వచ్చిన సువర్ణావకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశంలో తొలిసారిగా తామే తిరంగా ర్యాలీ నిర్వహించామని సీఎం గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో, ప్రధానమంత్రికి మద్దతుగా నిలవాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు దుప్పటి కప్పుకుని పడుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో పార్టీల ప్రమేయం లేకుండా, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 
Revanth Reddy
Telangana CM
Kishan Reddy
Pakistan
India
Rajiv Gandhi
Indira Gandhi
Modi Government
US relations

More Telugu News