G Parameshwara: కర్ణాటక హోంమంత్రి మెడికల్ కాలేజీపై ఈడీ దాడులు

G Parameshwara Karnataka Home Ministers College Raided by ED
  • బంగారం స్మగ్లింగ్ కేసులో సోదాలు జరుపుతున్న అధికారులు
  • రన్యారావు స్మగ్లింగ్ కేసులో హోంమంత్రి మెడికల్ కాలేజీలో తనిఖీలు
  • రాన్యా రావు, పరమేశ్వర కాలేజీ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాన్యా రావు వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం కీలక చర్యలు చేపట్టారు. కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ లో సోదాలు జరిపారు.

రాన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, పరమేశ్వర చైర్మన్‌గా ఉన్న మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పరమేశ్వర కాలేజీలో లేరని, తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమయ్యారని తెలిసింది. కాలేజీకి సంబంధించిన ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రాన్యా రావును బంగారంతో పట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె ఫోన్‌లో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల కాంటాక్ట్ నంబర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాన్యా రావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన ఫోటో బయటకు రావడంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఆరోపణలను "రాజకీయ కుట్ర"గా కొట్టిపారేశారు.
G Parameshwara
Karnataka Home Minister
Ranya Rao
Gold Smuggling Case
Siddhartha Medical College
Enforcement Directorate
ED Raids
Tumakuru
DK Shivakumar
Siddaramaiah

More Telugu News