Pawan Kalyan: కర్ణాటక నుంచి ఏపీకి వస్తున్న కుంకి ఏనుగుల పేర్లు ఇవే

Names of Kumki elephants coming from Karnataka to Hyderabad
  • ఏపీకి కర్ణాటక నుంచి ఐదు కుంకీ ఏనుగులు
  • అడవి ఏనుగుల దాడుల నివారణే ప్రధాన ఉద్దేశం
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చొరవతో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల దాడులతో అల్లాడుతున్న రైతులకు ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించి, కర్ణాటక నుంచి ఐదు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ ఏనుగులను ఏపీకి అప్పగించే కార్యక్రమం జరిగింది. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అప్పగింతకు ముందే, ఏపీకి రానున్న ఐదు ఏనుగుల పేర్లను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. వాటి పేర్లు రంజని, దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అని వెల్లడించింది.

గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో... అడవి ఏనుగుల గుంపులు అటవీ ప్రాంతాల్లోంచి వచ్చి పంట పొలాలపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో గ్రామాలపై దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమించాయి. ఈ సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండటంతో, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా, ఆయన బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనంతరం కర్ణాటక అటవీశాఖ మంత్రి అమరావతికి వచ్చి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించారు. ఈ చర్చల ఫలితంగా, కుంకీ ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం,  ఈరోజు ఐదు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక ప్రభుత్వం అందించింది. అప్పగింత కార్యక్రమంలో భాగంగా, ఏనుగుల పేర్లతో ప్రత్యేకంగా బోర్డులను కూడా ఏర్పాటు చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కుంకీ ఏనుగుల రాకతో, ఏపీలోని ప్రభావిత ప్రాంతాల్లో అడవి ఏనుగుల దాడులను నియంత్రించి, రైతులు, స్థానికులకు రక్షణ కల్పించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
.
Pawan Kalyan
Andhra Pradesh
Karnataka
Kumki elephants
wild elephants
forest department
crop damage
Siddaramaiah
DK Shivakumar
elephant attack

More Telugu News