Nara Lokesh: బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటా: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Promises Support to Balakotireddy Family
  • టీడీపీ కార్యకర్తలే పార్టీకి బలమన్న మంత్రి లోకేశ్
  • మృతిచెందిన నేత బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ
  • ఉండవల్లి నివాసంలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో లోకేశ్ భేటీ
  • హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
  • ఆర్థిక సాయంతో పాటు, ఇంటి తాకట్టు విడిపిస్తానని లోకేశ్ హామీ
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, వారి సంక్షేమానికి తాను పెద్దన్నలా అండగా ఉంటానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే కార్యకర్తల బాగోగులు చూడటం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన దివంగత టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ నేడు ఉండవల్లి నివాసానికి పిలిపించి పరామర్శించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కుటుంబ సభ్యుల ఆవేదన, మంత్రి హామీ

మంత్రి లోకేశ్ ను కలిసిన వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, ఆయన సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాలకోటిరెడ్డి హత్య జరిగిన తీరును, ప్రస్తుత ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను వారు మంత్రికి వివరించారు. హత్య కేసులో నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కేసు విచారణను వేగవంతం చేసి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు లోకేశ్ ను కోరారు. తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, నివాసం ఉంటున్న ఇల్లు కూడా తాకట్టులో ఉందని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన మంత్రి నారా లోకేశ్, వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విడుదలకు కృషి చేయడంతో పాటు, పార్టీ తరపున ఇంటి తాకట్టును విడిపిస్తానని మాట ఇచ్చారు. హత్య కేసు నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. "వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులను ఎదుర్కొని నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్య వంటివారే మనకు స్ఫూర్తి. మీ కుటుంబానికి ఇంటి పెద్దకొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను" అని వారికి ధైర్యం చెప్పారు. మంత్రి లోకేశ్ తమకు అండగా నిలవడం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బాలకోటిరెడ్డి సేవలు, హత్యోదంతం

అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండదండలతో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ హత్యకు ఆరు నెలల ముందు కూడా ఆయనపై కత్తులతో దాడికి విఫలయత్నం జరిగింది. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు గతంలో తెలిపారు.
Nara Lokesh
Venna Balakotireddy
TDP
Andhra Pradesh Politics
Rompicherla
Gopireddy Srinivasa Reddy
Political Violence
Telugu Desam Party
Palnadu District
Crime

More Telugu News