Gold Price: మళ్లీ భగ్గుమన్న బంగారం.. రూ.1 లక్ష మార్కు దిశగా పసిడి, వెండి ధరలు

Gold Price surges again towards Rs 1 lakh mark
  • మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • ఢిల్లీలో రూ.98,450కి చేరిన తులం మేలిమి పసిడి ధర
  • ఒక్కరోజే రూ.1,910 ఎగబాకిన పసిడి ధర
  • రూ.99,160కి పెరిగిన కిలో వెండి ధర
  • అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలహీనతే కారణం
దేశీయంగా బంగారం ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ. 1,910 పెరిగి రూ.98,450కి చేరి, లక్ష రూపాయల దిశగా పయనిస్తోంది. మంగళవారం నాటి ముగింపు ధర రూ.96,540గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా సాయంత్రం ఏడు గంటల సమయానికి పది గ్రాముల పసిడి ధర రూ.98 వేల పైనే నమోదవుతోంది.

బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కిలో వెండి ధర రూ.1,660 పెరిగి రూ.99,160కి చేరుకుంది. మంగళవారం దీని ధర రూ.97,500 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,311 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు తగ్గుముఖం పట్టినప్పుడు 3,400 డాలర్ల పైకి చేరిన బంగారం ధర, ఆ తర్వాత కొంతకాలం 3,200 డాలర్ల కంటే దిగువకు వచ్చింది. తాజాగా మళ్లీ ప్రపంచవ్యాప్తంగా పలు అనిశ్చిత పరిస్థితులు తలెత్తడంతో బంగారం ధర మరోసారి 3,300 డాలర్ల మార్కును దాటింది.

బంగారం ధర మళ్లీ పెరగడానికి కారణాలివే...

ఈ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీనపడటం బంగారానికి డిమాండ్ పెంచుతోందని అబన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు. దీనికి తోడు, ఆర్థిక లోటు కారణంగా యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తగ్గించడం కూడా ప్రభావం చూపిందని అన్నారు. ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక స్థిరత్వంపై అనిశ్చితిని పెంచిందని, దీంతో పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు.

మరోవైపు, ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా మార్కెట్‌లో భయాలను రేకెత్తించాయని కోటక్ సెక్యూరిటీస్‌లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కైనత్ చైన్వాలా పేర్కొన్నారు. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని విశ్లేషించారు.
Gold Price
Gold Rate
Silver Price
Silver Rate
Delhi Gold Price
Hyderabad Gold Price

More Telugu News