Chandrababu Naidu: బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టుపై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

Chandrababu Naidu Visits Bangalore Kempegowda Airport Terminal 2
  • బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2ను సందర్శించిన సీఎం చంద్రబాబు
  • ఎయిర్‌పోర్ట్ సీఈఓ హరి మరార్‌తో కలిసి సౌకర్యాల పరిశీలన
  • అధునాతన వసతులు, ప్రకృతి రమణీయత అద్భుతమన్న సీఎం
  • అధికారులు, ప్రయాణికులతో మాట్లాడి వివరాల సేకరణ
  • ఏపీలోనూ ప్రపంచస్థాయి విమానాశ్రయాల అభివృద్ధికి ఈ పర్యటన కీలకమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ 2ను సందర్శించారు. విమానాశ్రయ సీఈఓ హరి మరార్‌తో కలిసి టెర్మినల్‌లోని సౌకర్యాలను, కార్యకలాపాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రయాణికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

టెర్మినల్ 2 సందర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్ 2ను ఎయిర్‌పోర్ట్ సీఈఓ హరి మరార్‌తో కలిసి సందర్శించాను. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలను అర్థం చేసుకోవడానికి అధికారులు, ప్రయాణికులతో మాట్లాడాను. సహజసిద్ధమైన వాతావరణంలో, అత్యాధునిక సౌకర్యాలతో టెర్మినల్ 2ను తీర్చిదిద్దడం నిజంగా ఆకట్టుకుంది. 

విమానాశ్రయం లోపల సహజమైన ఉద్యానవనం ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది. దీనితో పాటు, మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా ఎయిర్‌పోర్ట్ రూపకల్పన, ఇక్కడి సౌకర్యాలు, పర్యావరణ హితమైన వాతావరణం ప్రశంసనీయం. విమానాశ్రయంలోని కార్యాచరణ అంశాలు, ఇతర సౌకర్యాలపై కూడా చర్చలు జరిపాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని మేం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈరోజు పర్యటన ద్వారా తెలుసుకున్న కీలక అంశాలు మా ప్రణాళికలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను కచ్చితంగా నమ్ముతున్నాను " అని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Kempegowda Airport
Bangalore Airport
Terminal 2
Hari Marar
Andhra Pradesh Airports
AP Airport Development
Airport Visit
Airport Infrastructure

More Telugu News