Reena: మేనల్లుడితో వివాహేతర బంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Reena Arrested for Husbands Murder in Kanpur Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసిన దారుణ ఘటన
  • పొరుగువారిపై హత్యానేరం మోపి, పోలీసులను తప్పుదోవ పట్టించిన కిలాడీ 
  • ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ రికార్డులతో నిగ్గుతేల్చిన పోలీసులు
  • భార్య రీనా, ఆమె మేనల్లుడు సత్యం అరెస్ట్
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేసిందో ఇల్లాలు. ఈ దారుణానికి మేనల్లుడి సహకారం తీసుకుంది. ఆపై ఏమీ ఎరగనట్టు, పొరుగింటి వారే తన భర్తను చంపారంటూ ఏడుస్తూ నమ్మబలికింది. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కాన్పూర్‌కు చెందిన ధీరేంద్ర అనే ట్రాక్టర్ యజమాని మే 11న తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి భార్య రీనా, తన భర్తను పక్కింటి వారే చంపారని ఆరోపించింది. ట్రాక్టర్ రిపేర్ విషయంలో కీర్తి యాదవ్, అతని కుమారులు రవి, రాజులతో తన భర్తకు గొడవ జరిగిందని, వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రీనా ఫిర్యాదు, స్థానికులు, కొంతమంది రాజకీయ నాయకుల జోక్యంతో పోలీసులు కీర్తి యాదవ్, అతని కుమారుడు రవిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

అయితే, కేసు దర్యాప్తులో పోలీసులకు కొన్ని అనుమానాలు తలెత్తాయి. భర్త హత్య ఇంటి బయట జరిగిందని రీనా చెప్పగా, ఫోరెన్సిక్ నిపుణుల తనిఖీలో ఇంటి లోపల రక్తపు మరకలు కనిపించాయి. హత్యకు ఉపయోగించినట్లుగా భావిస్తున్న రక్తంతో తడిసిన మంచం కోడు కూడా లభ్యమైంది. డాగ్ స్క్వాడ్ సైతం ఇంటి వద్దే ఆగిపోయింది. అంతేకాకుండా, హత్య జరిగిన రోజు రాత్రి రీనా తన మేనల్లుడు సత్యంతో సుమారు 40 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో రీనాకు, ఆమె మేనల్లుడు సత్యంకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో సత్యంను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. హత్య జరిగిన రోజు రాత్రి ధీరేంద్రకు రీనా మత్తుమందు ఇచ్చిందని, అతను గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత తనకు ఫోన్ చేసిందని సత్యం అంగీకరించాడు. అనంతరం రీనా మంచం కోడుతో ధీరేంద్ర తలపై బాది హత్య చేసిందని సత్యం పోలీసులకు వివరించాడు.

ఇద్దరం కలిసి రక్తపు మరకలను శుభ్రం చేశామని, ఆ తర్వాత రీనా తన పిల్లలతో కలిసి మేడపై నిద్రపోయిందని తెలిపాడు. సత్యం ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. తమ వివాహేతర సంబంధం గురించి ధీరేంద్రకు తెలియడంతోనే అతన్ని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. తొలుత అరెస్టు చేసిన పొరుగువారిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Reena
Uttar Pradesh
Kanpur
murder
crime
lover
husband murder
police investigation

More Telugu News