Uber: ఉబెర్ కు నోటీసులు ఇచ్చారు... ఇక రాపిడో వంతు?

Uber Issued Notice for Advance Tip Collection Rapido Next
  • ముందస్తు టిప్ వసూళ్లపై ఉబెర్‌కు కేంద్రం నోటీసులు
  • వివరణ ఇచ్చేందుకు ఉబెర్‌కు 15 రోజుల గడువు
  • ఇదే విధానం పాటిస్తే రాపిడోపైనా విచారణకు అవకాశం
రైడ్ బుకింగ్ సేవల సంస్థ ఉబెర్ ప్రయాణికుల నుంచి 'ముందస్తు టిప్' వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విధానంపై వివరణ ఇవ్వాలంటూ ఉబెర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే తరహా విధానాలను అనుసరిస్తున్నట్లు తేలితే, బైక్-ట్యాక్సీ సేవల సంస్థ రాపిడోపైనా విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రైడ్ త్వరగా పొందేందుకు వీలుగా ప్రయాణికులను ముందస్తుగా టిప్ చెల్లించమని ఉబెర్ ప్రోత్సహిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను బలవంతంగా లేదా నర్మగర్భంగా ముందస్తు టిప్ చెల్లించమని కోరడం అనైతికం, దోపిడీతో సమానం. ఇటువంటి చర్యలు అనుచిత వ్యాపార విధానాల కిందకు వస్తాయి," అని ఆయన పేర్కొన్నారు. 

సేవ ప్రారంభం కాకముందే టిప్ అడగడం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని, ఇది వినియోగదారుల పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రాపిడో కూడా వినియోగదారులను సేవకు ముందే టిప్ చెల్లించమని ప్రోత్సహిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే, ఆ సంస్థపైనా సీసీపీఏ ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరిణామం రైడ్ హెయిలింగ్ సేవల సంస్థల వ్యాపార విధానాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Uber
Uber India
Rapido
Ride booking services
Advance tip
Prahlad Joshi
Consumer rights
CCPA
Ride-hailing services
Unfair trade practices

More Telugu News