Mohanlal: నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్

Mohanlals Great Decision for Underprivileged Children
  • నిరుపేద పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయిస్తానన్న మోహన్ లాల్
  • 'బి ఎ హీరో' పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం
  • విశ్వశాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు 
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనలోని మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్న ఆయన తన 65వ పుట్టినరోజును జరుపుకున్నారు. 1960 మే 21న జన్మించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుమారు 400 చిత్రాల్లో నటించి, ఇప్పటికీ కథానాయకుడిగా చురుగ్గా సినిమాలు చేస్తూ, ఇతర భాషా చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మోహన్ లాల్ రెండు కీలకమైన సేవా కార్యక్రమాలను ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

కేరళలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. "చాలా మంది చిన్నారులు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వారిలో అనేకమందికి ఈ ఆపరేషన్ అత్యవసరం. అలాంటి వారందరికీ తన ఫౌండేషన్ అండగా నిలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

దీంతో పాటు, 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఒక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మోహన్ లాల్ 2015లో తన తల్లిదండ్రుల పేరిట విశ్వశాంతి ఫౌండేషన్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
Mohanlal
Mohanlal birthday
Malayalam actor
ViswaSanthi Foundation
liver transplant
Kerala children
Be a Hero campaign
drug abuse
charity
social service

More Telugu News