Jaishankar: పాక్ లో దాక్కున్నా సరే ఉగ్రవాదులను వదిలిపెట్టబోమన్న జైశంకర్

Jaishankar vows to target terrorists even in Pakistan
  • ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని వెల్లడి
  • కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని స్పష్టం చేసిన మంత్రి
  • ట్రంప్ మాటలు పట్టించుకోబోమని వివరణ
  • కశ్మీర్‌పై చర్చల్లేవ్.. అది భారత్‌లో అంతర్భాగమని తేల్చిచెప్పిన జైశంకర్
ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాక్కున్నా వదిలిపెట్టబోమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదని, ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉందని వివరించారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణ తర్వాత పాక్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదించిందని చెప్పారు. దీనిపై ద్వైపాక్షిక చర్చల తర్వాత కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని వివరించారు.

ఈ విషయంలో అమెరికా సహా ఎవరి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపైనా మంత్రి జైశంకర్ స్పష్టత ఇచ్చారు. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక విధానంగా ప్రోత్సహించడంపై భారత్ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని, అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని జైశంకర్ నొక్కి చెప్పారు.

"ఆపరేషన్ సిందూర్ ను వ్యూహాత్మకంగానే కొనసాగిస్తున్నాం. ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని చెప్పడానికే ఈ ఆపరేషన్. ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఉన్నా సరే, వారిని అక్కడే మట్టుబెడతాం" అని జైశంకర్ హెచ్చరించారు. అయితే, ఆపరేషన్ సూత్రప్రాయంగా కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం సైనిక చర్యలు లేవని, ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు.

మే 10న పాకిస్థాన్ సైన్యం హాట్‌లైన్ ద్వారా కాల్పుల విరమణకు సిద్ధమని సందేశం పంపిందని, దానికి తాము సానుకూలంగా స్పందించామని జైశంకర్ వెల్లడించారు. అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం కేవలం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్యే జరిగిందని పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు.

కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, అది భారత్‌లో అంతర్భాగమని, తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తి లేదని జైశంకర్ తేల్చిచెప్పారు. "1947-48 నుంచి పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారో వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆయన అన్నారు. నియంత్రణ రేఖ లేదా జమ్మూకశ్మీర్ పాలనా నిర్మాణాలపై చర్చించేది లేదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
Jaishankar
S Jaishankar
India Pakistan
Terrorism
Operation Sindoor
Ceasefire Agreement
Kashmir
Pakistan
Donald Trump
External Affairs Minister

More Telugu News