Ranya Rao: నటి రన్యారావుకు హోంమంత్రి 'పెళ్లి కానుక' ఇచ్చారు: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ranya Rao Home Minister Gifted Actress Says DK Shivakumar
  • పెళ్లి సమయంలో రన్యారావుకు హోంమంత్రి పరమేశ్వర కానుక ఇచ్చారన్న డీకే శివకుమార్ 
  • ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
  • పరమేశ్వర విద్యాసంస్థల్లో ఈడీ అధికారుల సోదాలు
  • పెళ్లి కానుక ఇవ్వడం సహజమన్న డీకే శివకుమార్
కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర నటికి వివాహ కానుక ఇచ్చారంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నటితో హోంమంత్రికి చెందిన విద్యాసంస్థలకు ఆర్థిక లావాదేవీలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వివరాల్లోకి వెళితే, బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రన్యారావుకు, హోంమంత్రి పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో సదరు వైద్య కళాశాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, డీకే శివకుమార్ హోంమంత్రి పరమేశ్వర నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "నేను ఇప్పుడే పరమేశ్వరను కలిశాను. ప్రజా జీవితంలో ఉన్న మేం అనేక కార్యక్రమాలకు హాజరవుతుంటాం. ఎంతోమందిని కలుస్తుంటాం. వాళ్లంతా ఏం చేస్తుంటారో మాకు తెలియదు కదా. పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు డబ్బులు, కానుకలు ఇవ్వడం సహజం. ఇక్కడ చట్టపరమైన విషయాల్లో గానీ, ఈడీ సోదాల్లో గానీ నేను జోక్యం చేసుకోవడం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. పెళ్లి సమయంలో నటికి గిఫ్ట్ ఇచ్చానని మంత్రి తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు" అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే, రన్యారావు నేరపూరిత చర్యలను ఏ రాజకీయ నాయకుడూ సమర్థించరని ఆయన స్పష్టం చేశారు.

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై హోంమంత్రి పరమేశ్వరను మీడియా సంప్రదించగా, "ఆ విషయం గురించి శివకుమార్‌నే అడగండి. దర్యాప్తునకు నేను పూర్తిగా సహకరిస్తాను" అని ఆయన సమాధానమిచ్చారు.

కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ నటి రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సుమారు 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రన్యారావు వివాహానికి హాజరైన ప్రముఖులు, వారు ఇచ్చిన కానుకలపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ వివాహ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి.పరమేశ్వర కూడా హాజరైనట్లు తెలియడంతో, హోంమంత్రికి సంబంధించిన కళాశాలపై ఈడీ దాడులు జరగడం గమనార్హం.
Ranya Rao
Karnataka
DK Shivakumar
G Parameshwara
Gold Smuggling Case
ED Raids

More Telugu News