CPI(M): మావోయిస్టుల వరుస ఎన్ కౌంటర్లు... కేంద్రంపై సీపీఐ(ఎం) పార్టీ తీవ్ర విమర్శలు

CPIM Criticizes Center Over Maoist Encounters
  • మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండన
  • చర్చలకు కేంద్రం మొండిచెయ్యి, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఎం విమర్శ
  • కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్‌గఢ్‌ సీఎంల వైఖరి ఫాసిస్టు ధోరణికి నిదర్శనమన్న పొలిట్‌బ్యూరో
  • మావోయిస్టుల నిర్మూలన విధానం అమానవీయమంటూ సీపీఎం ఆక్షేపణ
  • ఘటనపై సీపీఐ, సీపీఐ (ఎంఎల్) కూడా ఆగ్రహం, న్యాయ విచారణకు డిమాండ్
  • కేశవరావును అరెస్టు చేయకుండా చంపడం హక్కులను కాలరాయడమేనన్న సీపీఐ
మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు మరో 27 మందిని ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారనడాన్ని సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ప్రాణాలు తీస్తోందని ఆ పార్టీ మండిపడింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వంగానీ, బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ సర్కారుగానీ సానుకూలంగా స్పందించడం లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

"చర్చలకు పిలుస్తున్నా స్పందించకుండా, 'నిర్మూలన' అనే పేరుతో కేంద్రం అమానవీయ విధానాన్ని అమలు చేస్తోంది. మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడానికి గడువు దగ్గర పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కూడా చర్చలు అనవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. వీరిద్దరి మాటలు ఫాసిస్టు మనస్తత్వాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం" అని సీపీఐ(ఎం) తమ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు జరపాలని ప్రజలు, అనేక రాజకీయ పార్టీలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని ఆరోపించింది.

కాగా, మావోయిస్టు అగ్రనేత కేశవరావు ఎన్‌కౌంటర్‌ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ, నక్సలిజంపై పోరాటంలో ఇదొక కీలకమైన విజయమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎం)తో పాటు సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. కేశవరావును చట్టప్రకారం అరెస్టు చేసి విచారించకుండా, ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని, ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోందని సీపీఐ పేర్కొంది.
CPI(M)
Maoists
Nambala Kesava Rao
encounter
Amit Shah
Chhattisgarh
Naxalism
CPI
political criticism
human rights

More Telugu News