Jagan Mohan Reddy: అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా?: సోమిరెడ్డి సవాల్

Somireddy Challenges Jagan to Resign Over Land Allegations
  • ఉర్సాకు రూపాయికే భూమి కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న సోమిరెడ్డి
  • అబద్ధమని తేలితే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్
  • వైసీపీ మనుగడ కోసమే జగన్ మీడియా ముందుకు వచ్చారన్న నక్కా ఆనంద్ బాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ఉర్సా సంస్థకు రూపాయికే భూములు కేటాయించామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, వైసీపీ మనుగడ కోసమే జగన్ మీడియా ముందుకు వచ్చారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. "మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ 8.21% వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానంలో ఉంది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇది కేవలం 11 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. కానీ, జగన్ రెడ్డి మాత్రం గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు" అని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని, మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకు నేడు కూటమి ప్రభుత్వం వడ్డీలు కడుతోందని ఆరోపించారు.

విశాఖ ఐటీ పార్క్‌లో ఉర్సా సంస్థకు 3.5 ఎకరాలు ఎకరా కోటి రూపాయల చొప్పున, మరోచోట 56.30 ఎకరాలు రూ. 50 లక్షల చొప్పున కేటాయించామని సోమిరెడ్డి తెలిపారు. "ఇడ్లీ వడ రేటుకు ఉర్సాకు భూములు ఇచ్చామని జగన్ కారుకూతలు కూస్తున్నారు. అలా ఇస్తే నేను సర్వేపల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అది నిజం కాకపోతే, యలహంక నుంచి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రెడ్డి రాజీనామా చేయాలి" అని సవాల్ విసిరారు. కూటమి పాలనలో పరిశ్రమల ప్రోత్సాహక మండలి (SIPB) ఆరు సార్లు సమావేశమై రూ. 4,95,000 కోట్ల పెట్టుబడులతో 4,55,000 ఉద్యోగాలకు ఆమోదం తెలిపిందని, మొత్తం రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే అందులో రూ. 3,19,000 కోట్లు రాయలసీమకే వస్తున్నాయని, ఇవి జగన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను సర్వనాశనం చేసి, కేంద్ర నిధులను దారిమళ్లించిన జగన్‌కు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, ఇప్పుడు విద్యుత్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 2014-19లో తాము సాగునీటికి రూ.63,000 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి కేవలం రూ. 23,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.

మరో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, వైసీపీ మనుగడ కోసమే జగన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. "తాను ఎక్కడికీ పోలేదు, గెస్ట్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు వచ్చిపోతాను, పార్టీ ఉంటుంది, భయపడవద్దు అని నేతలకు చెప్పినట్లుంది ఆయన ప్రెస్ మీట్" అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.2%తో రెండో స్థానంలో ఉందని చెబుతుంటే జగన్‌కు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 72% పూర్తయిన పోలవరాన్ని ఒక్క శాతం కూడా పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి నాశనం చేశారని, నేడు ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తోందని తెలిపారు.

మైనింగ్‌పై జగన్ మాట్లాడటం సిగ్గుచేటని, తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుండి ఓబులాపురం మైనింగ్ పాపంలో జగన్ హస్తం ఉందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంచి ఇచ్చామని, వచ్చే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నామని, చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్క గుంత కూడా పూడ్చలేదని, తాము రూ.1500 కోట్లు ఖర్చు చేసి రోడ్లు మరమ్మతు చేశామని తెలిపారు. "ఇతరులపై ఉమ్మివేయాలని చూస్తే అది జగన్ ముఖంపైనే పడుతుంది. జగన్ చేసిన విద్రోహాలను సరిదిద్దడానికి సమయం పడుతుంది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తుంది. పీ4 మోడల్‌తో చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పోలవరం, అమరావతిని పూర్తి చేస్తాం" అని నక్కా ఆనంద్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh
Somireddy Chandramohan Reddy
TDP
AP Growth Rate
Polavaram Project
Amaravati
Nakka Anand Babu
AP Economy

More Telugu News