Henry Olonga: ఒకప్పుడు సచిన్ తో ఢీ అంటే ఢీ... ఆ తర్వాత పొట్టకూటి కోసం బోట్ క్లీనర్!

Henry Olonga From Facing Sachin to Boat Cleaner
  • ఒకప్పుడు సచిన్‌తో హోరాహోరీ కొనసాగించిన జింబాబ్వే బౌలర్ ఒలాంగా
  • ప్రభుత్వంపై నిరసనతో దేశం విడిచిన వైనం
  • 20 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ప్రవాస జీవితం
  • సంగీత ప్రదర్శనలతో పొట్టపోసుకుంటున్న వైనం
  • స్వదేశానికి, కన్నతండ్రికి దూరంగా ఒలాంగా
  • బోట్ క్లీనర్ గా కూడా పనిచేశానని వెల్లడి
1990వ దశకంలో క్రికెట్ ఫాలో అయిన భారత అభిమానులకు హెన్రీ ఒలాంగా పేరు సుపరిచితమే. ముఖ్యంగా 1998 షార్జాలో జరిగిన కోకా-కోలా కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఆ మ్యాచ్‌లో యువ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ అయిన ఒలాంగా బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ (92 బంతుల్లో 124 నాటౌట్) విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఒలాంగా కేవలం ఆరు ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ జ్ఞాపకాలే కాకుండా, ఒలాంగా జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. అప్పట్లో సచిన్ ను సవాల్ చేసి దెబ్బతిన్న బౌలర్ గా ఒలాంగా గురించి చెప్పుకునేవారు.

2003లో, జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనలో "ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ" ఒలాంగా తన సహచర ఆటగాడు ఆండీ ఫ్లవర్‌తో కలిసి ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా నల్ల బ్యాండ్లు ధరించి నిరసన తెలిపాడు. ఈ సాహసోపేత చర్య అతనికి ప్రాణహానిని తెచ్చిపెట్టింది. దీంతో ఒలాంగా దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. గత 20 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ప్రవాస జీవితం గడుపుతున్నాడు, ఇప్పటివరకు స్వదేశానికి తిరిగి వెళ్లలేదు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాత ఒలాంగా సంగీతం వైపు మళ్లాడు. 2019లో 'ది వాయిస్' అనే ప్రముఖ షోలో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్‌లో సంగీతాన్ని విడుదల చేస్తూ, దొరికినచోటల్లా ప్రదర్శనలిస్తున్నాడు. ఇటీవల క్రూయిజ్ షిప్‌లలో కూడా పాడుతున్నట్లు తెలిపాడు. "క్రూయిజ్ షిప్‌లో పాడటం అనేది సంగీత ప్రదర్శనలో అత్యున్నత స్థాయి కాకపోవచ్చు. నిజానికి, మరెక్కడా రాణించలేకపోయినప్పుడే గాయకులు క్రూయిజ్ షిప్‌లకు వెళతారని కొందరు అనుకుంటారు. కానీ నాకు అలాంటి ఇబ్బందేమీ లేదు. నా సంగీతం గురించి నాకే అహం లేదు. చిన్న చిన్న వృద్ధాశ్రమాల్లో, పాఠశాల పిల్లల ముందు, ముగ్గురు నలుగురు మాత్రమే ఉండే చిన్న బార్లలో కూడా పాడాను. నాకు పాడటం, ప్రదర్శన ఇవ్వడం అంటే ఇష్టం" అని ఒలాంగా చెప్పాడు. "నేను అన్ని రకాల పనులు చేశాను. ఇతరుల పడవలు శుభ్రం చేశాను. మోటివేషనల్ ప్రసంగాలు, డిన్నర్ తర్వాత ప్రసంగాలు చేశాను. నేను జీవితంలో అత్యుత్తమ సమయాన్ని గడుపుతున్నానని చెప్పను, ఎందుకంటే కొంతమంది దృష్టిలో నేను నిస్సారమైన, ఊహించగలిగే, విసుగుపుట్టించే జీవితాన్ని గడుపుతున్నాను. కానీ కనీసం ఇది నిజాయతీతో కూడుకున్నది, నేను ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉంటున్నాను" అని వివరించాడు.

గత 20 ఏళ్లుగా అతను జింబాబ్వేకు తిరిగి వెళ్లలేదని, ప్రస్తుతం 80వ దశకంలో ఉన్న తన తండ్రిని కూడా చూడలేదని వెల్లడించాడు. ఆయన తండ్రి ఇప్పటికీ బులవాయోలోనే నివసిస్తున్నారు.

ముగాబే 2017లో పదవీచ్యుతుడైనప్పుడు ఒలాంగా స్వదేశానికి తిరిగి రావడానికి ఆసక్తిచూపుతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అతను తిరిగి రాలేదు. ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. "ఇది చాలా కష్టమైన విషయం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఇప్పుడు నేను పాశ్చాత్యుడిలా ఆలోచిస్తున్నాను. నేను అడిలైడ్‌లో నివసిస్తున్నాను, ఇక్కడ పనులు సక్రమంగా జరుగుతాయి" అని ఒలాంగా పేర్కొన్నాడు. ఏదేమైనా ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ జీవితం ఇలా అనుకోని మలుపులు తిరిగి, కన్నవారికి, మాతృభూమికి దూరంగా కొనసాగుతోంది.
Henry Olonga
Sachin Tendulkar
Zimbabwe cricket
Andy Flower
Robert Mugabe
The Voice Australia
cricket
Zimbabwe politics
Australia
cruise ship singer

More Telugu News