Kavitha: బీజేపీతో దోస్తీ, వాటిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్: కేసీఆర్‌కు కూతురు కవిత సంచలన లేఖ!!

Kavitha Letter to KCR on BJP Alliance Negative Feedback
  • కవిత లేఖ రాసినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం
  • భారాస రజతోత్సవ సభానంతరం వెలుగులోకి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ
  • సభలో బీజేపీపై కేసీఆర్ పరిమిత విమర్శలతో పొత్తు ఊహాగానాలు మొదలయ్యాయని ప్రస్తావన
  • రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయకపోవడంపై ప్రశంసలు వచ్చాయని వెల్లడి
  • క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యం, బీజేపీ ప్రత్యామ్నాయమనే భావన శ్రేణుల్లో ఉందని వెల్లడి
  • కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండాలని, పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కవిత విజ్ఞప్తి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల స్పందనలను వివరిస్తూ కవిత ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. గతంలో కవిత రాసిన లేఖల్లోని దస్తూరితో ఈ లేఖలోని చేతిరాత సరిపోలుతుండటం గమనార్హం.

ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ సభ విజయవంతమైనందుకు తండ్రి కేసీఆర్‌కు అభినందనలు తెలియజేస్తూ, కవిత పలు కీలక అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా, సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా విమర్శలు చేయడం వల్ల, భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని లేదా మార్గనిర్దేశం చేయాలని అందరూ ఆశించినట్లు తెలిపారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారని సమాచారం.

లేఖలోని ముఖ్యాంశాలు

లేఖలో కవిత ప్రధానంగా ఎనిమిది అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించకపోవడాన్ని చాలామంది ప్రశంసించారని సానుకూల అంశంగా పేర్కొన్నారు. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం గురించి కేసీఆర్ ప్రస్తావిస్తారని చాలామంది ఆశించారని, ఆయన నుంచి మరింత పదునైన విమర్శలను పార్టీ శ్రేణులు ఆశించినట్లు తెలిపారు.

అదే సమయంలో, వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమైందని కవిత పేర్కొన్నారు. పాత ఇన్‌ఛార్జులనే మళ్లీ నియమించడం వల్ల, ఉద్యమకారులకు గతంలో మాదిరిగానే సదుపాయాలు అందలేదన్న సమాచారం ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ-ఫారాలను ఇన్‌ఛార్జుల ద్వారా కాకుండా, పార్టీ అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు.

సభా వేదికపైకి కేసీఆర్ రాకముందు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవారితో మాట్లాడించి ఉంటే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక కార్యక్రమం "ధూం ధాం" కూడా కార్యకర్తలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని అన్నారు. తాను వ్యక్తిగతంగా బీజేపీని లక్ష్యంగా చేసుకోవాలని భావించానని, బహుశా తాను వారి బాధితురాలిని కాబట్టి అలా అనుకొని ఉండవచ్చని లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని, ఈ నేపథ్యంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందేమోనన్న ఆలోచనలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయని కవిత తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించారన్న భావనను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలామంది కేసీఆర్‌ను కలవలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారని, కొంతమందికి మాత్రమే ఆయనను కలిసే అవకాశం దక్కుతుందన్న భావన నెలకొందని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండాలని, ఇప్పటికైనా పార్టీ ప్లీనరీని ఒకటి రెండు రోజులు నిర్వహించాలని ఆమె కేసీఆర్‌కు సూచించారు. ఈ విషయాలపై ఆలోచించాలని తండ్రిని కోరుతూ, ఇంత సుదీర్ఘంగా లేఖ రాసినందుకు క్షమించాలని కవిత పేర్కొన్నారు.
Kavitha
KCR
BRS
BJP
Telangana politics
Kavitha letter
Revanth Reddy
BRS silver jubilee
Telangana elections
Political analysis

More Telugu News