DK Aruna: కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై... డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

DK Aruna Reacts to Kavitha Letter to KCR
  • లేఖ నిజంగా కవితే రాశారా? అని అరుణ అనుమానం
  • దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉండొచ్చని ఆరోపణ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్య
  • బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ధీమా
  • రేవంత్ రెడ్డితో కవితకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా ప్రచారంలో ఉన్న ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు కవితే ఈ లేఖ రాశారా? లేక ఆమె పేరుతో వేరేవాళ్లు దీన్ని బయటకు వదిలారా? అనే అనుమానాలున్నాయని ఆమె అన్నారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల ప్రదర్శన కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని డీకే అరుణ ఆరోపించారు.

ఈ లేఖ విడుదల వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉండొచ్చని డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారని ఆమె విమర్శించారు. కవిత లేఖను అడ్డం పెట్టుకుని బీజేపీని లక్ష్యంగా చేసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందని కొన్ని పార్టీలు కలలు కంటున్నాయని, కానీ ప్రజల్లో బీజేపీపై నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. "తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ విఫలమయ్యాయి. ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు," అని డీకే అరుణ పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని డీకే అరుణ కుండబద్దలు కొట్టారు. గతంలో చేసిన కుట్రలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కవితకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఇద్దరూ కలిసి గతంలో వ్యాపారాలు కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయని డీకే అరుణ గుర్తు చేశారు. తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నిస్తూ, ఈ లేఖ ద్వారా బీజేపీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, కానీ వారి కుట్రలు ఫలించవని, బీజేపీ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని చూరగొందని ఆమె స్పష్టం చేశారు. 
DK Aruna
KCR
Kavitha letter
Telangana politics
BRS
బీజేపీ
Revanth Reddy
Congress party
MLC elections

More Telugu News