Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందంపై కర్ణాటకలో దుమారం

Tamannaah Bhatia Mysore Sandal Deal Sparks Controversy in Karnataka
  • రూ.6.2 కోట్లకు రెండేళ్ల ఒప్పందం చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయంపై కన్నడ సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • మైసూరు సబ్బుకు ప్రచారకర్తగా బాలీవుడ్ నటి ఎందుకంటూ నిరసన
  • దేశవ్యాప్త మార్కెట్ కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వ వివరణ
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత మైసూరు శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్ణాటకలో దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారుచేసే ఈ సబ్బుకు ముంబై నటిని అంబాసిడర్‌గా ఎంపిక చేయడంపై కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మైసూర్ శాండల్ సోప్ ప్రచారానికి కర్ణాటక ప్రభుత్వం తమన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల కాలానికి గాను రూ.6.2 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది.

ఈ నిర్ణయం ప్రాంతీయ అస్తిత్వం, ప్రాతినిధ్యంపై చర్చకు దారితీసింది. కర్ణాటక సాంస్కృతిక వారసత్వంలో భాగమైన ఈ బ్రాండ్‌కు స్థానిక కన్నడ నటినే ప్రచారకర్తగా నియమించాలని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. "ఈ నిర్ణయం అనైతికం, బాధ్యతారాహిత్యం. కన్నడిగుల మనోభావాలను ఇది తీవ్రంగా దెబ్బతీసింది. 1916లో నాటి మైసూరు మహారాజు కృష్ణరాజ వొడయార్ ప్రారంభించిన ఈ సబ్బుకు ఎంతో వారసత్వం ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ప్రచారకర్తగా బాలీవుడ్ నటిని ఎంపిక చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక కళాకారులను అవమానించిందని ఆయన ఆరోపించారు.

ఈ విమర్శలను కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ తోసిపుచ్చారు. మార్కెటింగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. "మైసూరు శాండల్ సబ్బును కర్ణాటక అవతల, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే మా లక్ష్యం. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి పలువురి పేర్లను పరిశీలించాం. దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ, తక్కువ ఖర్చు, 2.8 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉండటం వంటి అంశాల ఆధారంగా తమన్నాను ఎంపిక చేశాం" అని మంత్రి వివరించారు.
Tamannaah Bhatia
Mysore Sandal Soap
Karnataka
Kannada activists
Brand ambassador controversy
Karnataka Soaps and Detergents Ltd
MB Patil
Siddaramaiah government
Narayana Gowda

More Telugu News