Ajit Doval: మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్

Ajit Doval to Visit Russia for S400 Delivery Talks
  • వచ్చే వారం రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
  • ఎస్-400 క్షిపణి వ్యవస్థల ముందస్తు డెలివరీపై చర్చలు
  • మాస్కోలో అంతర్జాతీయ భద్రతా సమావేశంలో పాల్గొనే అవకాశం
  • ఇప్పటికే మూడు ఎస్-400 వ్యవస్థలు భారత్‌కు అందజేత
భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల మిగిలిన యూనిట్ల డెలివరీని వేగవంతం చేసే విషయమై చర్చించేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆయన రష్యా ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.

మే 27 నుంచి 29 వరకు మాస్కోలో జరగనున్న భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు దోవల్ అధికారికంగా వెళుతున్నప్పటికీ, ఈ పర్యటనలో ప్రధానంగా ఎస్-400 డెలివరీల అంశంపైనే దృష్టి సారించనున్నారని పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న 'ఆపరేషన్ సిందూర్' ఘటనల నేపథ్యంలో, ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆ సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలు పాకిస్థాన్ వైమానిక దాడుల యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

రష్యాకు చెందిన ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ శక్తివంతమైన క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారత్, రష్యాల మధ్య 2018లో సుమారు రూ.35 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. మొత్తం ఐదు ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థల కోసం ఈ ఒప్పందం జరిగింది. వీటిలో ఇప్పటికే మూడు వ్యవస్థలు భారత్‌కు చేరాయి. మిగిలిన రెండు వ్యవస్థల డెలివరీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంగా కారణంగా ఆలస్యం అయింది. షెడ్యూల్ ప్రకారం 2026 ఆగస్టు నాటికి అందజేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మరియు సరిహద్దు ఉద్రిక్తతల దృష్ట్యా, ఈ డెలివరీలను మరింత ముందుగా, అంటే వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భారత్ భావిస్తోంది. ఈ దిశగా రష్యా అధికారులతో దోవల్ చర్చలు జరిపి, వారిని ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎస్-400 వ్యవస్థలు శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో కూల్చివేయగలవు. అంతేకాకుండా, ప్రత్యర్థుల ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలను కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ప్రస్తుతం ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం పర్యవేక్షిస్తోంది. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని పంజాబ్, రాజస్థాన్‌లలో, చైనా నుంచి రక్షణ కోసం ఈశాన్య రాష్ట్రాల్లో (అరుణాచల్‌ ప్రదేశ్‌ లేదా అసోం) వీటిని మోహరించినట్లు సమాచారం.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ అసత్య ప్రచారం చేయగా, ప్రధాని మోదీ ఎస్-400 మోహరించిన స్థావరం నుంచి ఫొటో విడుదల చేశారు. భారత సైన్యం కూడా పాక్ ప్రచారాన్ని ఖండించి, మన రక్షణ వ్యవస్థలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉన్నాయని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, మరిన్ని ఎస్-400 వ్యవస్థలు త్వరగా చేరితే, భారత రక్షణ వలయం మరింత పటిష్టం కానుంది.
Ajit Doval
S-400
Russia
India
Air defense system
Defense deal
NPO Almaz
Operation Sindoor
Indian Air Force
Ukraine war

More Telugu News