Indigo Flight: ప్రమాదకర స్థితిలో చిక్కుకున్న ఇండిగో విమానానికి పాకిస్థాన్ అనుమతి నిరాకరణ... విరుచుకుపడుతున్న నెటిజన్లు

Indian netizens fires on Pakistan for not giving clearance to Indigo flight
  • ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానానికి వడగళ్ల ముప్పు
  • పఠాన్‌కోట్ సమీపంలో తీవ్రమైన కుదుపులకు లోనైన విమానం
  • పాక్ గగనతలంలోకి అనుమతి నిరాకరించిన లాహోర్ ఏటీసీ
ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 220 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బుధవారం 6E 2142 నంబరు గల ఇండిగో A321 నియో విమానం పఠాన్‌కోట్ సమీపంలో తీవ్రమైన వడగళ్ల వాన, బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. ఈ క్రమంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది.

ప్రమాదకరమైన వడగళ్ల వాన నుంచి విమానాన్ని సురక్షితంగా బయటపడేసేందుకు పైలట్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా, అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించేందుకు లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతిని కోరారు. అయితే, పాకిస్థాన్ ఏటీసీ ఇందుకు నిరాకరించినట్లు ఏవియేషన్ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో విమానం ముందు భాగం (నోస్ కోన్) తీవ్రంగా దెబ్బతింది. ఈ నష్టం ఆధారంగా విమానం ఎంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఘటనపై డీజీసీఏ లోతైన దర్యాప్తు చేపట్టింది. ప్రయాణికులెవరూ గాయపడలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్ మానవతా దృక్పథంతో స్పందించకపోవడంపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ కి సింధు జలాలను ఆపడంలో తప్పులేదని పోస్టులు పెడుతున్నారు. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Indigo Flight
Indigo 6E 2142
Pakistan ATC
Lahore ATC
DGCA
Srinagar
Pathankot
Hailstorm
Flight Emergency

More Telugu News