Anjali Jain: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మైసూర్ 'పాక్' పేరును మార్చేసిన రాజస్థాన్ వ్యాపారి

Anjali Jain Renames Mysore Pak Sweet as Mysore Sri
  • జైపూర్‌లోని ఓ స్వీట్ షాపులో మైసూర్ పాక్ పేరు మార్పు
  • మైసూర్ పాక్‌కు బదులుగా 'మైసూర్ శ్రీ' అని కొత్త నామకరణం
  • 'పాక్' పదం పాకిస్థాన్‌ను గుర్తుచేస్తోందని వ్యాపారి నిర్ణయం
  • దేశభక్తితోనే ఈ మార్పు చేసినట్లు దుకాణం యజమాని వెల్లడి
  • మోతీ పాక్, ఆమ్ పాక్ వంటి ఇతర స్వీట్ల పేర్లలోనూ 'శ్రీ' చేరిక
  • 'పాక్' అంటే వండటం అని అర్థమైనా, శబ్దంతోనే సమస్య అన్న యజమాని
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక మిఠాయి దుకాణ యజమాని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేశభక్తిని చాటుకునేందుకు తన దుకాణంలో విక్రయించే కొన్ని మిఠాయిల పేర్లను మార్చేశారు. ముఖ్యంగా, అందరికీ సుపరిచితమైన 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్చడం విశేషం.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, కొందరు సామాజిక మాధ్యమాలలో 'మైసూర్ పాక్' వంటి స్వీట్ల పేర్లలో 'పాక్' అనే పదాన్ని తొలగించాలని ప్రచారం చేశారు. ఈ ఆలోచన జైపూర్‌లోని ప్రముఖ 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్‌కు బాగా నచ్చింది. వెంటనే ఆమె తన దుకాణంలోని కొన్ని స్వీట్ల పేర్లను మార్చేశారు.

'మైసూర్ పాక్'ను 'మైసూర్ శ్రీ'గా, మోతీ పాక్‌ను 'మోతీ శ్రీ'గా, ఆమ్ పాక్‌ను 'ఆమ్ శ్రీ'గా, గోండ్ పాక్‌ను 'గోండ్ శ్రీ'గా మార్చారు. అలాగే, స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్‌ పాక్‌లను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చారు.

దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ, "దేశభక్తి కేవలం సరిహద్దుల్లో సైనికులకే పరిమితం కాదు. ప్రతి పౌరుడిలోనూ దేశం పట్ల ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.

వాస్తవానికి, 'పాక్' అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీనికి 'వండటం' లేదా 'పాకం పట్టడం' అని అర్థం. చక్కెర లేదా బెల్లంతో చేసే తీపి పదార్థాలను కొన్ని భాషల్లో పాకం అంటారు. ఈ పదానికి పాకిస్థాన్‌ దేశంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ, పలికేటప్పుడు ఆ దేశం పేరును గుర్తుకు తెస్తుండటంతోనే ఈ మార్పు చేసినట్లు అంజలీ జైన్ వివరించారు. 'శ్రీ' అనే పదం శుభానికి, సౌభాగ్యానికి సూచిక కాబట్టి ఆ పదాన్ని చేర్చినట్లు పేర్కొన్నారు.
Anjali Jain
Tyoahar Sweets
Mysore Pak
Rajasthan
Jaipur
Indian Sweets
Sweet Names Change
Operation Sindoor

More Telugu News