YS Jagan: జగన్ ప్రశ్నలకు బదులివ్వండి: కూటమి ప్రభుత్వంపై శైలజానాథ్ ధ్వజం

Shailajanath Demands Answers from Chandrababu on YS Jagans Questions
  • లిక్కర్ స్కామ్‌పై కూటమిది కట్టుకథ అన్న శైలజానాథ్
  • ఈనాడు కథనంపై తీవ్ర విమర్శలు
  • కూటమి నేతల మాటల్లో పొంతన లేదని ఎద్దేవా
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మద్యం కుంభకోణాన్ని వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారని, దానికి స్పందించకుండా ఈనాడు పత్రిక ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం చెబుతున్న మద్యం కుంభకోణంలో కోట్ల పేజీల సమాచారం డిలీట్ అయిందంటూ ఈనాడులో కథనం రాయించడం విడ్డూరంగా ఉందని శైలజానాథ్ అన్నారు. ఒకవైపు డేటా మొత్తం ధ్వంసమైందని చెబుతూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ నుంచి సమాచారం సేకరించామని చెప్పడం, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని చెబుతున్నారని, అసలు డిస్టిలరీలకు అనుమతులు, వాటి సామర్థ్యం పెంపు ఎవరి కాలంలో జరిగాయో చెప్పాలని శైలజానాథ్ ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం లేకుండా రూ.1300 కోట్ల ప్రివిలేజ్ ఫీజు మాఫీ చేయడం, ముఖ్యమంత్రికి కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం వంటివి ఎవరు చేశారని నిలదీశారు. టీడీపీ హయాంలోని మద్యం వ్యవహారాలకు సంబంధించిన నోట్ ఫైళ్లపై చంద్రబాబు, నాటి మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలున్నాయని, ఇప్పుడు చెబుతున్న కుంభకోణంలో తమ సంతకాలు ఎక్కడున్నాయో చూపాలని సవాల్ విసిరారు.

జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఈనాడును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తోందని శైలజానాథ్ మండిపడ్డారు. కోట్ల పేజీల సమాచారం తొలగించారంటూ ఈనాడు ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించిందని, అదే సమయంలో బ్యాక్ ఎండ్ ద్వారా సమాచారం సేకరించి వేల కోట్ల అక్రమాలు జరిగాయని నిర్ధారించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఒకవేళ సమాచారం నిజంగానే డిలీట్ అయితే బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ విభాగాల్లో సమాచారం ఒకచోట కాకపోతే మరోచోట ఉంటుందని, దాన్ని పూర్తిగా నాశనం చేయడం సాధ్యం కాదని, ఈ మాత్రం ఈనాడుకు తెలియదా? అని ఎద్దేవా చేశారు.

మద్యం కుంభకోణంపై కూటమి నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన లెక్కలు చెబుతున్నారని, వారి మాటల్లోనే పొంతన లేదని శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబు రూ.10 వేల కోట్లని, పురందేశ్వరి రూ.25 వేల కోట్లని, అచ్చెన్నాయుడు లక్ష కోట్లని, పవన్ కల్యాణ్ రూ.41 వేల కోట్లని, అసెంబ్లీలో చంద్రబాబు రూ.18 వేల కోట్లని, అదే రోజు పవన్ కళ్యాణ్ రూ.30 వేల కోట్లని, ఎంపీ సీఎం రమేష్ రూ.30 వేల కోట్లని, ఎంపీ కృష్ణదేవరాయులు రూ.18 వేల కోట్లని ఇలా తలో మాట మాట్లాడారని, దీన్నిబట్టి అసలు కుంభకోణమే జరగలేదని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
YS Jagan
Andhra Pradesh
Chandrababu Naidu
YSRCP
Shailajanath
Liquor Scam
TDP
Eeenadu
Political News
AP Politics

More Telugu News