Lakhan: హత్య కేసులో 43 ఏళ్ల జైలు జీవితం.. 104 ఏళ్లకు నిర్దోషిగా విడుదల!

Lakhan Freed at 104 After 43 Years in Jail for Murder
  • 1977 నాటి హత్య కేసులో పడిన జీవిత ఖైదు
  • అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా కీలక తీర్పు
  • విచారణ దశలోనే ముగ్గురు సహ నిందితుల మరణం
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన, కుమార్తెకు అప్పగించిన అధికారులు
  • సుదీర్ఘ జైలు జీవితం అనంతరం విడుదల
నాలుగు దశాబ్దాలకు పైగా జైలు జీవితం గడిపిన ఓ శతాధిక వృద్ధుడు ఎట్టకేలకు నిర్దోషిగా తేలాడు. ఒక హత్య కేసులో సుమారు 43 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన అనంతరం, 104 ఏళ్ల వయసులో కారాగారం నుంచి విడుదలయ్యాడు. ఈ అసాధారణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా పరిధిలోని గౌరాయే గ్రామంలో 1977 ఆగస్టు 16న రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ప్రభూ సరోజ్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య, హత్యాయత్నం కేసుకు సంబంధించి లఖాన్‌ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. విచారణ జరిపిన ప్రయాగ్‌రాజ్‌లోని జిల్లా సెషన్స్‌ కోర్టు, 1982లో ఈ నలుగురికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు నలుగురూ అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. అయితే, ఈ అప్పీల్‌పై విచారణ కొనసాగుతుండగానే ముగ్గురు నిందితులు మరణించారు. సుదీర్ఘ కాలం తర్వాత, అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఈ కేసు విచారణను పూర్తి చేసింది. మే 2వ తేదీన లఖాన్‌ను నిర్దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పుతో అతడి విడుదలకు మార్గం సుగమమైంది.

జైలు రికార్డుల ప్రకారం, లఖాన్‌ 1921 జనవరి 4న జన్మించారు. 1977లో హత్య ఆరోపణలపై అరెస్టయిన నాటి అతడు నుంచి జైలులోనే ఉన్నాడు. ప్రస్తుతం లఖాన్ వయసు 104 సంవత్సరాలు. సుమారు 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం అతడు విడుదలయ్యాడు. జైలు అధికారులు లఖాన్‌ను అదే జిల్లాలోని షరీరా గ్రామంలో నివసిస్తున్న అతడి కుమార్తె సంరక్షణకు అప్పగించారు.
Lakhan
Lakhan Uttar Pradesh
Kaushambi district
Allahabad High Court
wrongful conviction

More Telugu News