Kavitha: కేసీఆర్‌కు లేఖ రాసింది నిజమే.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయ్: కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha Reacts to Letter Leak Claims Demons Surround KCR
  • కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్య
  • తాను రాసిన లేఖ లీక్ కావడంపై కుట్ర జరిగిందని ఆరోపణ
  • పార్టీలోని కొందరు కోవర్టులే లేఖను బయటపెట్టారని అనుమానం
  • లేఖలో వ్యక్తిగత అజెండా లేదని, కార్యకర్తల అభిప్రాయాలే ఉన్నాయని స్పష్టం
  • పార్టీలోని లోపాలు సరిదిద్దుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని హితవు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను దేవుడితో పోల్చిన ఆమె, ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమేనని కవిత అంగీకరించారు. సుమారు రెండు వారాల క్రితమే ఈ లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు. "ఆ లేఖ నాదే, అందులో నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే చెప్పాను" అని కవిత పేర్కొన్నారు.

అంతర్గతంగా తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు. "కేసీఆర్‌ దేవుడు.. కానీ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏమిటి? నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?" అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు కోవర్టులే ఈ లేఖను లీక్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆరే తమ నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని కవిత పునరుద్ఘాటించారు. అయితే, పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కాగా, కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Kavitha
KCR
BRS
Telangana Politics
Letter Leak
Party Workers
Internal Politics
Telangana Jagruthi

More Telugu News