Sunrisers Hyderabad: మరో అద్భుత విజయం సాధించిన సన్ రైజర్స్... ఈసారి ఆర్సీబీ ఢమాల్!

Sunrisers Hyderabad Secure Another Stunning Victory Against RCB
  • లక్నోలో ఆర్సీబీ × సన్ రైజర్స్
  • 42 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ
  • 232 పరుగుల ఛేదనలో ఆర్సీబీ 189 ఆలౌట్
మొన్న లక్నో సూపర్ జెయింట్స్ ను ఇంటికి పంపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తాజాగా మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన  మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేజింగ్ లో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. విధ్వంసకర ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగగా, కెప్టెన్ పాట్ కమిన్స్ (3/28) బంతితో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. 232 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్సర్) శుభారంభం అందించారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు సాధించారు. దాంతో బెంగళూరు గెలుపు ఈజీయే అనిపించింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించింది.

అయితే వీరి నిష్క్రమణ తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. మయాంక్ అగర్వాల్ (11), రజత్ పాటిదార్ (18), కెప్టెన్ జితేష్ శర్మ (15 బంతుల్లో 24) విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్లు గొప్ప సమన్వయంతో ఆర్సీబీని కట్టడి చేశారు.  దాంతో, ఆర్సీబీ చివరి 7 వికెట్లను 16 పరుగుల తేడాతో చేజార్చుకుంది.

సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లతో పాటు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. 13 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు ఇది 5వ విజయం. హైదరాబాద్ టీమ్ తన చివరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 25న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
Sunrisers Hyderabad
SRH vs RCB
Royal Challengers Bangalore
Pat Cummins
Ishan Kishan
IPL 2024
Indian Premier League
Cricket
Arun Jaitley Stadium
Kolkata Knight Riders

More Telugu News