MBBS Student: మహారాష్ట్రలో దారుణం.. వైద్య విద్యార్థినిపై తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం

MBBS Student Gang Raped by Fellow Students in Sangli of Maharashtra
  • మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘ‌ట‌న‌
  • కర్ణాటకలోని బెళగావికి చెందిన బాధితురాలు 
  • సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని
  • మత్తు మందు ఇచ్చి ముగ్గురు విద్యార్థుల సామూహిక లైంగిక దాడి
మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణం జ‌రిగింది. మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన‌ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన బాధితురాలు (22) మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 18న రాత్రి 10 గంటలకు తన స‌హ‌చ‌ర‌ విద్యార్థులతో కలిసి సినిమా చూడాలనుకుంది. 

అయితే, వారిలో ఒకరు అంతకుముందే ఆమెను తన ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో మెడికల్‌ స్టూడెంట్‌తో పాటు ఓ యువకుడు ఉన్నాడు. నలుగురు కలిసి మద్యం సేవించారు. మత్తులో ఆమెకు స్పైక్డ్‌ డ్రింక్‌ ఇచ్చారు. అది తాగిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. 

స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిన ఘోరాన్ని ప్రశ్నించింది. దాంతో ఎవరికైనా చెబితే చంపేస్తామ‌ని ముగ్గురు నిందితులు ఆమెను బెదిరించారు. కానీ, బాధిత యువ‌తి త‌న‌కు జ‌రిగిన ఘోరాన్ని త‌న‌ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు విశ్రాంబాగ్ పోలీసుల‌ను ఆశ్రయించారు. దాంతో పోలీసులు నిందితుల‌పై భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్‌ కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. 

నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారు పుణె, షోలాపూర్‌, సాంగ్లికి చెందినవారని, అంతా 20 నుంచి 22 ఏళ్ల‌ లోపువారేనని వెల్లడించారు. న్యాయస్థానం వారిని మే 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించిందని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
MBBS Student
Sangli
Maharashtra
Gang Rape
Medical Student
Belagavi
Karnataka
Crime News

More Telugu News