KTR: కవిత లేఖపై కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR Responds to Kavitha Letter on KCR and Party Issues
  • అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించాలన్న మాజీ మంత్రి
  • పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలేనని, అందరికీ ఈ రూల్ వర్తిస్తుందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అన్న కేటీఆర్
  • పార్టీలో ఎవరైనా అధ్యక్షుడికి తమ సూచనలు చెప్పొచ్చని వివరణ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖ బయటకురావడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని, తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే దీనికి నిదర్శనమని కవిత చెప్పారు. కవిత రాసిన లేఖపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం స్పందించారు.

పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని హితవు పలికారు. పార్టీలో తనతో సహా అందరూ కార్యకర్తలేనని, ఈ నియమం అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, కవిత లేఖపై స్పందించాలంటూ మీడియా ప్రతినిధులు కోరగా.. ఆయన ముక్తసరిగా స్పందించారు. రెండు ముక్కల్లో విషయం తేల్చేసి, దానిపై ఇక మాట్లాడేదీ లేదని చెప్పారు.

పార్టీలో దయ్యాలు ఉన్నారని కవిత చేసిన ఆరోపణలపై ఏమంటారని అడగగా.. ప్రస్తుతం తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన ఆ శనిని, ఆ దయ్యాన్ని వదిలించడంపైనే తాము, తమ పార్టీ దృష్టి సారించిందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రతీ పార్టీలోనూ కోవర్టులు ఉంటారని, సమయం వచ్చినప్పుడు వారు ఎవరనేది బయటపడుతుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని కేటీఆర్ చెప్పారు.

పార్టీలో ఏ కార్యకర్త అయినా తన అభిప్రాయాలను, సూచనలను అధ్యక్షుడికి తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అభిప్రాయ వెల్లడి అనేది మౌఖికంగా, లేఖల ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా.. ఇలా వివిధ పద్ధతులలో జరుగుతుంటుందని వివరించారు. అయితే, కొన్ని విషయాలను అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుందని, వాటిని అంతర్గతంగానే చర్చించాలని కేటీఆర్ చెప్పారు. కాగా, ప్రెస్ మీట్ పూర్తయ్యేవరకూ కేటీఆర్ తన సోదరి కవిత పేరెత్తకపోవడం గమనార్హం.
KTR
Kalvakuntla Kavitha
KCR
BRS Party
Telangana Politics
Revanth Reddy
National Herald Case
Telangana Bhavan
Congress Coverts
Party Affairs

More Telugu News