Mustafa: భార్యపై కోపాన్ని మధ్యవర్తిపై చూపించిన భర్త.. మంగళూరులో దారుణ హత్య

Man kills middleman over marriage dispute in Mangalore
  • భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త తీవ్ర ఆగ్రహం
  • పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిపై కత్తితో దాడి
  • తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తరలించేలోపే మధ్యవర్తి మృతి
వివాహం జరిగిన నాటి నుంచీ గొడవలు జరగడం, భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇలాంటి సంబంధం కుదిర్చావేంటని మధ్యవర్తితో గొడవపడ్డాడు. భార్యపై ఉన్న కోపాన్ని మధ్యవర్తిపై చూపించాడు. కత్తితో దాడి చేయడంతో మధ్యవర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుందీ దారుణం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరుకు చెందిన ముస్తఫా (30) అనే యువకుడికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ముస్తఫా కుటుంబంతో పరిచయం ఉన్న సులేమాన్ (50) దగ్గరుండి సంబంధం కుదిర్చాడు. మధ్యవర్తిగా, పెళ్లి పెద్దగా వ్యవహరించాడు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచి ముస్తఫా, ఆయన భార్య నిత్యం గొడవపడుతూనే ఉన్నారు. పెద్దలు సర్దిచెప్పినా వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఇటీవల ముస్తఫాతో మరోసారి గొడవ జరగడంతో ఆయన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రానని తేల్చిచెప్పింది.

దీంతో ముస్తఫా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అదే ఆవేశంతో మధ్యవర్తి సులేమాన్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఇలాంటి సంబంధం కుదిర్చావేంటని దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో సులేమాన్ మెడపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సులేమాన్ కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. తండ్రిని కాపాడుకునేందుకు సులేమాన్ కొడుకులు రియాబ్, సియాబ్‌ అడ్డుపడగా.. వారిపైనా దాడి చేశాడు. ముస్తఫా దాడిలో గాయపడ్డ సులేమాన్ కొడుకులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రియాబ్, సియాబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mustafa
Mangalore murder
Karnataka crime
marriage dispute
middleman killed
domestic violence
crime news
India crime

More Telugu News