Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ పేర్ని నాని

Perni Nani fires on Pawan Kalyan
  • సినిమా థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని పేర్ని నాని మండిపాటు
  • సినిమా వాళ్లను బెదిరించడానికి మీరెవరని ఆగ్రహం
  • జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో సినిమా టికెట్ల ధరల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారని ఆరోపించారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌పైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలు తక్కువ ధరలకే సినిమాలు చూడాలని పవన్ ఆకాంక్షించడాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. "గతంలో ఇదే పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సినిమా మాది, మా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటామని అన్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేస్తున్నారు?" అని పేర్ని నాని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం పవన్ కు తగదని హితవు పలికారు.

సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమకు మేలు చేస్తానంటూ ఆ శాఖను చేపట్టిన మంత్రి, ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలపై విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. "సినిమా వాళ్లకు గొడవలు జరుగుతున్న సమయంలో జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. మీ చెప్పుచేతుల్లో ఉన్న మంత్రితో ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారా? రాబోయే ఓ ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా?" అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను బెదిరించడానికి మీరెవరని, అసలు వారి సమస్యేంటో మీకు తెలుసా? అని ఆయన పవన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇవి దివాలాకోరు రాజకీయాలు కాదా? అని ఆయన మండిపడ్డారు.

వైసీపీకి అంత్యక్రియలు చేస్తామంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. "అంత్యక్రియలు చేయడం సోమిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయంగా అండగా నిలిచిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనత వీరిది" అని విమర్శించారు. మంత్రి పదవులు రాలేదన్న కారణంతో ఎవరికి పడితే వారికి అంత్యక్రియలు చేయొద్దని సూచించారు. వాసంశెట్టి సుభాష్‌ను "ఒక పిల్ల గాడిద" అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
Pawan Kalyan
Perni Nani
YS Jaganmohan Reddy
Somireddy Chandramohan Reddy
Vasamshetti Subhash
Andhra Pradesh Politics
Telugu Cinema Tickets
Movie Theaters
YSR Congress Party
Political Criticism

More Telugu News