Ranganath HydRA: వాటి పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

Ranganath HydRA Commissioner Says Protecting Layouts is Government Responsibility
  • లేఔట్లలో పార్కులు, రోడ్ల రక్షణ ప్రభుత్వ పూర్తి బాధ్యత
  • పది శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయితేనే లేఔట్‌కు గుర్తింపు
  • లేఔట్లలో మార్పులకు ప్లాట్ల యజమానుల అనుమతి తప్పనిసరి
  • ప్రజావసరాలకు లేఔట్‌లో పది శాతం స్థలం కేటాయించాలి
ప్రజలందరి వినియోగం కోసం లేఔట్లలో కేటాయించిన పార్కులు, రహదారులు, ఇతర ఉమ్మడి స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బుద్ధవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన లేఔట్‌ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన నిపుణులు హాజరై అభిప్రాయాలు పంచుకున్నారు.

లేఔట్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సదస్సులో చర్చించారు. లేఔట్‌ను అధికారికంగా గుర్తించాలంటే, అందులోని ప్లాట్లలో కనీసం పది శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అనుమతి పొందిన లేఔట్‌లో మార్పులు చేయాల్సి వస్తే, ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులందరి సమ్మతితోనే సవరించిన ప్లాన్‌కు ఆమోదం తెలపాలని అభిప్రాయపడ్డారు. ప్రతి లేఔట్‌లోనూ మొత్తం విస్తీర్ణంలో పది శాతం భూమిని పార్కులు, ఆటస్థలాలు, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించాలని నిపుణులు సూచించారు.

లేఔట్‌కు అనుమతినిచ్చింది పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ లేదా హెచ్‌ఎండీఏ వంటి ఏ సంస్థ అయినా, అందులోని పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని రంగనాథ్ తెలిపారు. కనీసం ఒక ఎకరం నుంచి ఎంత పెద్ద విస్తీర్ణంలోనైనా లేఔట్లు వేసుకోవచ్చని ఆయన సూచించారు. వ్యవసాయ భూమి లేఔట్‌గా మారిన తర్వాత ఆ సమాచారం రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. దీని కారణంగా, అసలు యజమానుల తర్వాతి తరం వారు పాత పాసు పుస్తకాల ఆధారంగా ఆ స్థలాలను తమ వ్యవసాయ భూమిగా భావించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని నిపుణులు సదస్సు దృష్టికి తెచ్చారు.

సమావేశం అనంతరం, శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం చెరువు పరిరక్షణకు కృషి చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశాంతి హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. చెరువును కాపాడటంలో ఆయన చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Ranganath HydRA
HydRA Commissioner
Layouts protection
GHMC
HMDA
DTCP

More Telugu News