Rahmatulla: చిన్నారి ఉసురు తీసిన కామాంధుడి ఇంటిని కూల్చేసిన గ్రామస్థులు

Moragudi villagers demolish accused Rahmatullas house
  • చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య  
  • జమ్మలమడుగు మండలం మోరగుడిలో ఆగ్రహావేశాలు
  • ఇలాంటి నీచుడు ఊళ్లో ఉండటానికి వీల్లేదని గ్రామస్థుల కఠిన నిర్ణయం
  • ఐదేళ్ల క్రితమే ఇల్లు అమ్మినా ఖాళీ చేయని నిందితుడి కుటుంబం
  • కొత్త యజమానుల అనుమతితోనే కూల్చివేత అని వెల్లడి
  • నిందితుడి తల్లి కువైట్‌లో, తండ్రి కూలీ పనులు
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చిన నిందితుడు రహ్మతుల్లా ఇంటిని ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు నేలమట్టం చేశారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి తమ గ్రామంలో ఉండటానికి వీల్లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

మోరగుడి గ్రామానికి చెందిన రహ్మతుల్లా ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదంతోపాటు ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో శనివారం గ్రామస్థులంతా ఏకమై నిందితుడి ఇంటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "ఇటువంటి దుర్మార్గుడు మా గ్రామంలో ఉండేందుకు అనర్హుడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే ఇలాంటి చర్యలు తప్పవు" అని పేర్కొన్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. నిందితుడు రహ్మతుల్లా తల్లి నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లారు. తండ్రి ఇక్కడే ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటున్నారు. ఐదేళ్ల క్రితమే రహ్మతుల్లా కుటుంబం నివాసముంటున్న ఇంటిని వేరొకరికి విక్రయించినప్పటికీ, వారు ఇంకా ఖాళీ చేయలేదని తెలిసింది. ప్రస్తుతం ఇంటిని కొనుగోలు చేసిన వారి అనుమతితోనే తాము ఈ కూల్చివేత చేపట్టామని గ్రామస్థులు వివరించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Rahmatulla
Kadapa district
Jammalamadugu
Moragudi village
Minor girl rape
Minor murder
Andhra Pradesh crime
Village demolition
Crime news Andhra Pradesh
Public outrage

More Telugu News