Chandrababu Naidu: కుప్పంలో కొత్తింటి కల సాకారం.. చంద్రబాబు దంపతుల గృహప్రవేశం.. లోకేశ్ భావోద్వేగం.. ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Housewarming Ceremony in Kuppam
  • కుప్పంలో సీఎం చంద్రబాబు నూతన గృహప్రవేశం
  • శాంతిపురం మండలం శివపురంలో కొత్త ఇంటి నిర్మాణం
  • పాల్గొన్న భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి
  • కుప్పం ప్రజల సమక్షంలో వేడుక జరిగిందన్న లోకేశ్
  • మీ ఆశీస్సులే మాకు దీవెనలన్న భువనేశ్వరి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గృహప్రవేశం చేశారు. ఈ ఆనందకరమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. కుప్పం ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. "36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ, ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయి. ఇది మా కుటుంబ పండగ కాదు, మనందరి పండగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయి" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవడం పట్ల స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శిరసు వంచి నమస్కరిస్తున్నా: భువనేశ్వరి
కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ, తమను ముందుకు నడిపిస్తున్న ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగిందన్నారు. కల్మషం లేని మంచి మనుషుల మధ్య తమ కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం తనకు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకొంటున్నట్టు భువనేశ్వరి పేర్కొన్నారు.

                                 
Chandrababu Naidu
Kuppam
Housewarming ceremony
Nara Lokesh
Bhuvaneswari
TDP
Andhra Pradesh Politics
Shantipuram
Sivapuram

More Telugu News