Zepto Delivery Boy: అడ్రస్ తప్పు పెట్టారని కస్టమర్ ను చితకబాదిన జెప్టో డెలివరీ బాయ్.. వీడియో ఇదిగో!

Zepto Delivery Boy Assaults Customer Over Address Dispute in Bangalore
  • బెంగళూరులోని బసవేశ్వరనగర్‌లో ఘటన
  • యువకుడి తలకు బలమైన గాయం, ఆసుపత్రిలో చికిత్స
  • సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు.. వీడియో వైరల్
  • నిందితుడిపై కేసు నమోదు చేసి జెప్టోకు నోటీసులు పంపిన పోలీసులు
బెంగళూరులోని బసవేశ్వరనగర్ లో కస్టమర్ పై జెప్టో డెలివరీ బాయ్ ఒకరు దాడి చేశాడు. డెలివరీ చిరునామా విషయంలో తలెత్తిన వివాదం కాస్తా దాడి వరకు వెళ్లింది. మే 21వ తేదీన జరిగిన ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ బాయ్ దాడి దృశ్యాలు ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. బసవేశ్వరనగర్‌కు చెందిన 30 ఏళ్ల శశాంక్ అనే వ్యాపారవేత్త జెప్టో ద్వారా కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారు. వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వచ్చాడు. ఆర్డర్ తీసుకునేందుకు శశాంక్ వదిన బయటకు వెళ్లగా, డెలివరీ చిరునామా తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్ధన్ ఆమెతో గొడవకు దిగాడు. పెద్దగా కేకలు వేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ గొడవను గమనించిన శశాంక్ అక్కడికి వచ్చి, డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్, శశాంక్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బసవేశ్వరనగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జెప్టో యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసి, నిందితుడి వివరాలు, ఆరోపణలపై వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు.
Zepto Delivery Boy
Vishnuvardhan
Bangalore
Basaveshwaranagar
Customer assault
Delivery dispute
Shashank
Online grocery delivery
Crime news

More Telugu News