Starlink: జస్ట్ రూ.840 కే నెలంతా అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ తో స్టార్ లింక్ ఎంట్రీ!

Starlink Entry with Unlimited Internet Offer at Just Rs 840
  • తక్కువ ధరలతో యూజర్లను ఆకట్టుకునే ప్లాన్
  • పల్లెలకూ హైస్పీడ్ నెట్.. స్టార్‌లింక్ ప్రణాళికలు
  • కోటి మంది వినియోగదారులను చేర్చుకోవడమే లక్ష్యం
  • ఇంకా పెండింగ్‌లోనే ఇన్-స్పేస్ అనుమతులు
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సహా ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆకర్షణీయమైన ప్రణాళికలు రచిస్తున్నాయి. వినియోగదారులను వేగంగా ఆకట్టుకునేందుకు, ప్రారంభంలో నెలకు రూ. 840 రూపాయలకే అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో మధ్య, దీర్ఘకాలంలో సుమారు కోటి మంది వినియోగదారులను చేర్చుకోవాలన్నదే ఈ సంస్థల టార్గెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక స్పెక్ట్రమ్ ఖర్చులను పెద్ద సంఖ్యలో యూజర్లతో భర్తీ చేసుకోవచ్చనే వ్యూహంతో మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు.

భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శాటిలైట్ సేవలపై కఠినమైన నియంత్రణలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా, పట్టణ ప్రాంత వినియోగదారులపై నెలకు రూ.500 ఛార్జి, సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్)పై 4 శాతం లెవీ, ప్రతి మెగాహెర్ట్జ్ శాటిలైట్ స్పెక్ట్రమ్‌కు కనీసం రూ.3,500 వార్షిక రుసుము ఉన్నాయి. వీటికి అదనంగా, వాణిజ్య సేవలు అందించేందుకు శాటిలైట్ సంస్థలు 8 శాతం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీల వల్ల శాటిలైట్ స్పెక్ట్రమ్ ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ, స్టార్‌లింక్ వంటి ఆర్థికంగా బలమైన సంస్థలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు వెనుకాడవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, స్టార్‌లింక్ విస్తరణ ప్రణాళికలకు సాంకేతిక పరిమితులు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ ప్రకారం.. ప్రస్తుతం స్టార్‌లింక్ వద్ద ఉన్న లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సంఖ్య 7 వేలు మాత్రమే. వీటితో ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది వినియోగదారులకు మాత్రమే సేవలు అందించవచ్చు. ఉపగ్రహాలను 18 వేలకు పెంచినా సరే భౌగోళిక పరిమితుల కారణంగా 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో కేవలం 15 లక్షల మంది యూజర్లకు మాత్రమే స్టార్ లింక్ సేవలు అందించగలదని అంచనా. దీంతో "పరిమిత సామర్థ్యం వల్ల, తక్కువ ధరలతో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవాలనే లక్ష్యం దెబ్బతినవచ్చు" అని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ హెచ్చరించింది.

భారత టెలికాం విభాగం (డాట్) శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు ఆమోదం తెలిపినప్పటికీ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) నుంచి అనుమతి లభించే వరకు స్టార్‌లింక్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. గతంలో యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు లైసెన్సులు లభించినా, ఇన్-స్పేస్ తుది ఆమోదం కోసం దాదాపు రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది.

ప్రస్తుతానికి, శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు సంప్రదాయ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కంటే 7 నుంచి 18 రెట్లు అధికంగా ఉన్నాయని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించి, వినియోగదారుల సంఖ్య పెరిగితే ధరలు తగ్గుముఖం పట్టవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, నియంత్రణపరమైన అడ్డంకులు, పరిమిత బ్యాండ్‌విడ్త్ వంటి సవాళ్లను అధిగమిస్తేనే శాటిలైట్ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Starlink
Elon Musk
Satellite internet
India
TRAI
Broadband
Low earth orbit
Internet service providers
Telecom
In-Space

More Telugu News