Perni Nani: ‘మత్తోడు ఇంతకింతా అనుభవిస్తాడు’.. జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు

Perni Nani Comments on GGH Superintendent Spark Controversy
  • వల్లభనేని వంశీ వైద్య పరీక్షల సందర్భంగా ఆసుపత్రి వద్ద అనుచరులతో నాని వీరంగం
  •  సూపరింటెండెంట్‌ను ‘మత్తోడు’, ‘చెంచా’ అంటూ తీవ్ర పదజాలంతో దూషణ
  • పేర్ని వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సత్యకుమార్, క్షమాపణకు డిమాండ్
  • చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరిక
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పేర్ని నాని, ఆయన అనుచరులు ఆసుపత్రి వద్ద గందరగోళం సృష్టించారు.

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పేర్ని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ తమ అనుచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది అడ్డుకోగా, వారిని పక్కకు నెట్టివేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులతో పేర్ని నాని వర్గీయులకు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిని కలవడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేసి, వారిని వెనక్కి పంపించారు.

అనంతరం, అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బందితో వైసీపీ నేతలు మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన అనంతరం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వైసీపీ నేతలు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు
వల్లభనేని వంశీని ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోలేదన్న కోపంతో బయటకు వచ్చిన పేర్ని నాని ఆసుపత్రి సూపరింటెండెంట్, మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.వి.రావును ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. "ఈ మత్తోడు.. ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి బెజవాడలోనే ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరీ చేస్తే ఇన్నాళ్లూ ఇక్కడున్నాడో. చంద్రబాబు, లోకేశ్‌కు అతడు చెంచాగిరీ చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింతా అనుభవించే రోజు వచ్చి తీరుతుంది" అని పేర్ని నాని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

 మంత్రి సత్యకుమార్ ఖండన 
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇతర వైద్యులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తీవ్రంగా ఖండించారు. "రోగులకు సేవలు అందించే వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలి" అని మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేశారు.

వైద్యుల సంఘం హెచ్చరిక
పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. వైద్యులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై వైద్య వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Perni Nani
Vallabhaneni Vamsi
Vijayawada GGH
Government Hospital Vijayawada
AP Minister Satya Kumar
Doctors Association
YSRCP
TDP
Hospital Superintendent
Andhra Pradesh Politics

More Telugu News