Ajit Agarkar: టీమిండియా కెప్టెన్‌గా గిల్ ఎంపిక అంత సులువుగా జ‌ర‌గ‌లేదు: అజిత్ అగార్క‌ర్

Ajit Agarkar on Shubman Gills Captain Selection for Team India
  • భార‌త జ‌ట్టు సార‌థిగా గిల్ ఎంపిక‌పై మాట్లాడిన‌ చీఫ్ సెల‌క్ట‌ర్
  • ఏడాది కాలంగా టెస్టుల్లో త‌దుప‌రి టీమిండియా కెప్టెన్‌పై దృష్టి సారించిన‌ట్లు వెల్ల‌డి
  • డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా అభిప్రాయాలు స్వీక‌రించామ‌న్న‌ అగార్క‌ర్
ఇంగ్లండ్‌తో జ‌రిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ శనివారం 18 మందితో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సిరీస్ నుంచే టీమిండియాకు కొత్త కెప్టెన్‌ను కూడా ఎంపిక చేసింది. రోహిత్ శ‌ర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో అత‌ని వార‌సుడిగా యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ను సార‌థిగా నియ‌మించింది. 

అయితే, టీమిండియా కెప్టెన్‌గా గిల్ ఎంపిక‌పై తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త జ‌ట్టు సార‌థిగా గిల్ ఎంపిక అంత సులువుగా జ‌ర‌గ‌లేద‌ని వివ‌రించాడు. రోహిత్‌-కోహ్లీ వ‌య‌సు పెరుగుతున్న నేప‌థ్యంలో ఏడాది కాలంగా టెస్టుల్లో త‌దుప‌రి టీమిండియా కెప్టెన్‌పై దృష్టిసారించిన‌ట్లు తెలిపాడు. ఈ క్ర‌మంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి అభిప్రాయాలు స్వీక‌రించిన‌ట్లు అగార్క‌ర్ చెప్పాడు. 

"మేము ఏదో ఒక‌టి రెండు ప‌ర్య‌ట‌న‌ల కోసం కెప్టెన్ల‌ను ఎంపిక చేయం. భ‌విష్య‌త్తులో మ‌మ్మ‌ల్ని ముందుకు తీసుకెళ్లే అంశంపైనే ఎక్కువ‌గా దృష్టిసారిస్తాం. దాదాపు ఏడాదిగా గిల్‌ను టీమిండియా నాయ‌క‌త్వం కోసం ప‌రిశీలిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అభిప్రాయాలు స్వీక‌రించాం. సార‌థ్యం అనేది ఎప్పుడూ చాలా ఒత్తిడితో కూడుకున్న‌బాధ్య‌త‌. మేము స‌రైన వ్య‌క్తినే ఎన్నుకొన్నాం అనుకుంటున్నా. అత‌డు అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా మెండుగా ఉన్నాయి. కెప్టెన్సీకి గిల్ క‌రెక్ట్ వ్య‌క్తి అనేది మా అభిప్రాయం. అత‌నికి అభినంద‌న‌లు" అని అగార్క‌ర్ పేర్కొన్నాడు. 

అటు వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2025-27పై కూడా అగార్క‌ర్ మాట్లాడుతూ...  వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కొత్త సైకిల్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అన్ని విధాల ఆలోచించాకే ఇంగ్లండ్ టూర్‌కి టీమ్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు. ఎవ‌రైనా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ప్పుడు మ‌నం ఏమీ చేయ‌లేమ‌ని, అది వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నాడు. 

ఇక టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కావ‌డంపై కూడా అగార్క‌ర్ మాట్లాడాడు. ఆ ఇద్ద‌రి స్థానాల‌ను భర్తీ చేయ‌డం అంత సులువు కాద‌న్నాడు. అయితే, ఇత‌ర ఆట‌గాళ్ల‌కు తామేంటో నిరూపించుకునేందుకు ఇది సువ‌ర్ణావ‌కాశం అని అభిప్రాయ‌ప‌డ్డాడు. 

"రోహిత్‌, కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత ఆ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డం సులువు కాదు. మ‌రో విధంగా ఆలోచిస్తే ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాల రిటైర్మెంట్ అనేది త‌మ‌ను తాము నిరూపించుకోవ‌డానికి ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు ల‌భించిన గోల్డెన్ ఛాన్స్" అని అజిత్ అగార్క‌ర్ చెప్పుకొచ్చాడు. 

కాగా, మే 7న టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు హిట్‌మ్యాన్ ప్ర‌క‌టించ‌గా... అత‌డి బాట‌లోనే అభిమానుల‌కు షాకిస్తూ ర‌న్ మెషీన్ కూడా మే 12న‌ లాంగ్ ఫార్మాట్‌కు అల్విదా చెప్పిన సంగ‌తి తెలిసిందే. 
Ajit Agarkar
Shubman Gill
Team India
BCCI
India vs England
Test series
Rohit Sharma retirement
Virat Kohli retirement
World Test Championship
Indian cricket team

More Telugu News