K Laxman: షర్మిల, కవితలను కాంగ్రెస్ పావులుగా వాడుకుంటోంది: బీజేపీ ఎంపీ విమర్శ

K Laxman Accuses Congress of Inciting Sharmila Against Jagan Kavitha Against KCR
  • కేసీఆర్, వైఎస్ఆర్ కుటుంబాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు
  • తండ్రులు కూడబెట్టిన ఆస్తుల పంపకాల్లోనే వివాదాలున్నాయని ఆరోపణ
  • అధికారం కోల్పోయాక కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బహిర్గతం
  • అన్నలపైకి చెల్లెళ్లను కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని లక్ష్మణ్ విమర్శ
  • షర్మిల, కవితలను కాంగ్రెస్ పావులుగా వాడుకుంటోందని ఆక్షేపణ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని విమర్శించారు.

డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, "ఒకప్పుడు అన్నల కోసం, వదినల కోసం బాణాలుగా మారిన చెల్లెళ్లు, ఇప్పుడు అధికారం, ఆస్తుల కోసం అన్నల మీదే బాణాలు గురిపెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ అవసరాలు, వారసత్వమే ముఖ్యమన్నట్లుగా ఈ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నాయి. నిన్న వైఎస్ఆర్ కుటుంబం, నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతున్నాయి" అని వ్యాఖ్యానించారు.

ఈ కుటుంబ కలహాల వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. "అన్నల మీదకు చెల్లెళ్లను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే, వైఎస్ షర్మిలను ఆయనపైకి ఉసిగొల్పి, ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అదేవిధంగా, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటోందన్న వాదన బలపడుతోంది" అని లక్ష్మణ్ విశ్లేషించారు.

తండ్రులు సంపాదించిన అక్రమాస్తులు, అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే ఈ కుటుంబ వివాదాలకు ప్రధాన కారణమని ఆయన పునరుద్ఘాటించారు. 
K Laxman
YS Sharmila
Kalvakuntla Kavitha
KCR family
YSR family
Telangana politics
Andhra Pradesh politics
Congress party
BJP
Family disputes

More Telugu News